Pawan kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఇద్దరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఐక్యంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. పొత్తులపై ప్రస్తుతం స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం లేదు. కానీ, రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలి అనేదానిపై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీవ్వమని పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం మొదలైంది. హైదరాబాద్ లోని శ్రీ చంద్రబాబు గారి నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. pic.twitter.com/73egeO8hx5
— JanaSena Party (@JanaSenaParty) April 29, 2023
ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఇది మూడోసారి. విశాఖ పట్నంలో పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా.. ఆయనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పవన్ కల్యాణ్ స్పందించారు. చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. తాజాగా మరో సారి ఇరువురు నేతలూ భేటీ అయ్యారు.