Site icon Prime9

Pawan Kalyan: పవన్ ఇమేజిని పెంచేసిన మోదీ

Pawan image

Pawan image

Pawan Kalyan-modi Meeting: ప్రధాని నరేంద్రమోదీతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఏకాంత భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. విశాఖ సాగరతీరాన జరిగిన ఈ సమావేశం, ఏపీలో అనేక రాజకీయ మార్పులకు దారి తీసే అవకాశం ఉందా? పవన్‌ను పిలిపించుకొని మరీ ప్రధాని మాట్లాడటం దేనికి సంకేతం? ఈ భేటీతో పవన్ ఇమేజిని మోదీ అమాంతం పెంచేశారా?

దేశాన్ని ఏలే ప్రధాని ఆయన. అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనది విశాఖలో ఒక టైట్ షెడ్యూల్ ప్రోగ్రాం. అందునా అరగంటకు పైగా టూర్ ఆలస్యం అయింది. ఈ టైంలో ముందుగా అనుకున్న కార్యక్రమాలు రద్దు అవడమో లేక కుదించబడడమో జరుగుతుంది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని వాయిదా వేసి మరీ జనసేనాని పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ ఇచ్చారు. అది కూడా షెడ్యూల్ లో పది నిముషాలు అని ఉంటే దాన్ని అరగంటకు పెంచుకుంటూ పోయారు. పైగా మోదీ, పవన్ ల భేటీ ఏకాంతంగా జరిగింది. వన్ టూ వన్ గా సాగిన ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో అత్యంత రాజకీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా చూడాలి. అందునా ఒక చీఫ్ మినిస్టర్ అదే సిటీలో ఉన్న వేళ ఎమ్మెల్యే కూడా కాని ఒక నాయకుడికి, ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ అధినేతకు మోదీ వంటి దేశంలో క్రేజ్‌ ఉన్న నాయకుడు కీలకమైన అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే పవన్ ఇమేజ్ అమాంతం పెరిగినట్లే అంటున్నారు విశ్లేషకులు.

ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే పవన్ కల్యాణ్‌ గ్రాఫ్ పెరుగుతోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి సీటు మీద గురి పెట్టారు. ఆయన తనదైన వ్యూహాలు ప్రణాళికల మేరకు పనిచేసుకుంటూ పోతున్నారు. ఈ నేపధ్యంలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇంతవరకూ పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ ని అసలు పట్టించుకోవడం లేదు అన్న బాధ అయితే పవన్ తో పాటు ఆ పార్టీ నేతలలో ఉంది. అయితే ఏకంగా ఎనిమిదేళ్ళ తరువాత పవన్ కల్యాణ్‌కి ప్రధాని ఈ విధంగా భేటీకి అవకాశం ఇవ్వడం, అనేక విషయాలను చర్చించడం ద్వారా ఫ్యూచర్ సీఎం ఆఫ్ ఏపీ అన్న సంకేతాన్ని, సందేశాన్ని జనాల్లోకి పంపించినట్లుగా ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరో వైపు చూస్తే మోదీ- పవన్ ల మధ్య ఏమి జరిగింది అనే దాని కంటే పవన్‌తో కలిసి బీజేపీ ఏపీ రాజకీయాల్లో ముందుకు సాగుతుంది అన్న బలమైన సంకేతాన్ని మాత్రం ఈ భేటీ ఇచ్చినట్లుగా భావించాలి. మరో వైపు చూస్తే ఏపీలో జగన్ సీఎంగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా నలభై ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు ఉన్నారు. ఏపీ రాజకీయాలు అంటే ఈ ఇద్దరే గుర్తుకు వచ్చేలా కొన్నేళ్ళుగా రాజకీయం సాగుతోంది. ఆ రాజకీయాన్ని మలుపు తిప్పే కీలకమైన భేటీగా కూడా మోదీ, పవన్ మధ్య సమావేశాన్ని అంతా చూస్తున్నారు.

ఈ భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఏపీకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ తనను అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. తనకు అవగాహన ఉన్నంత మేరకు అన్ని విషయాలను ఆయనకు వివరించానన్నారు. మోదీతో తాను భేటీ కావడం భవిష్యత్తులో అనేక పరిణామాలకు నాంది పలుకుతుందని పవన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మంచి రోజులు వస్తాయని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని పవన్ చెప్పడం విశేషం. ఏపీలో ఆర్థిక పరిస్థితులు, మూడు రాజధానుల పేరుతో వైసీపీ చేస్తున్న రాజకీయం, ప్రతిపక్ష నేతల పై తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేయడం, పోలీసులను సీఐడీని వాడుకుంటూ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరినీ కొట్టించడం తిట్టించడం చేస్తున్నారని పవన్, నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. లెక్కకు మిక్కిలిగా ఉచిత పథకాల పేరుతో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నారని మోదీ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. ఇటీవల విశాఖ పర్యటనలో పోలీసులు తన పట్ల చేసిన అతి, తమ పార్టీ నేతలను అర్ధరాత్రి అరెస్టు చేయడం, హత్య కేసులు నమోదు చేయడం వంటివి చేశారని ప్రధానికి పవన్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

మొత్తం మీద  ప్రధాని నరేంద్ర మోదీ, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఏకాంత భేటీ, రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో అనేకమైన కీలక మార్పులకు దారితీస్తుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మీటింగ్‌తో పవన్ ఇమేజ్ మాత్రం బాగా పెరిగింది అనే అంటున్నారు. ఏపీకి మోదీ రావడం కాదు కానీ టాక్ ఆఫ్ ది స్టేట్ గా పవన్ వార్తల్లో నిలిచిపోయారు అని అంటున్నారు.

Exit mobile version