Site icon Prime9

Ysr Congress Party : ఎమ్మెల్యే వసంత వర్సెస్ ఎంపీ విజయసాయి – ఎన్నారైలపై పరస్పర విరుద్ధ ప్రకటనలు.. జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు

mla vasantha krishna prasad and mp vijaya sai reddy statements on guntur stampede issue

mla vasantha krishna prasad and mp vijaya sai reddy statements on guntur stampede issue

Ysr Congress Party : ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు మారితున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దాలకు తెరలేపుతూ హీట్ పెంచుతున్నారు. కాగా మరోవైపు అధికార వైకాపాలో అసమ్మతి సెగతో సీఎం జగన్ కు ఎమ్మెల్యేలు షాక్ లు ఇస్తున్నారు. ఇటీవలే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొత్తగా ఇంచార్జ్ ని నియమించారు. కాగా జనవరి 1 వ తేదీన గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెదేపా చంద్రన్న కానుక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఘటనలో తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ తొక్కిసలాట రాజకీయంగా సంచలనం రేకెత్తించింది.

వైసీపీ ప్రభుత్వం కూడా ఘటనపై సీరియస్‌గా రియాక్ట్ అయింది. కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించిన ఉయ్యూరు శ్రీనివాసరావు అనే ఎన్నారైపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేసింది. విజయవాడలోని ఓ హోటల్‌లో ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. కందుకూరు, గుంటూరు వరుస ఘటనల తరుణంలో సర్కారు ఏపీలో రోడ్ షో లను కూడా బ్యాన్ చేసింది. కాగా ఇప్పుడు తాజాగా పార్టీ అంతా ఒకవైపు ఉంటే నేనొక్కడినే ఒకవైపు అన్నట్లుగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా ఎన్నారై లపై సోషల్ మీడియా వేదికగా మరోలా స్పందించారు. దీంతో జగన్ కి ఏం చేయాలో పరిస్థితి ఎదురైందని అనిపిస్తుంది.

వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు…

ఓ కార్యక్రమంలో పాల్గొన్న వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ… గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదని అన్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు,ప్రవాసాంధ్రుల వలన దేశానికి మంచి జరుగుతుంది. శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి, ప్రజలకు నష్టం జరగాలని ఇలాంటి కార్యక్రమాన్ని చేయరు. టీడీపీ తో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టి శ్రీనివాస్ పై ఇలా వివాదాలు ముసురుకుంటున్నాయి. సేవా కార్యక్రమాలు చేయడం మంచిపని. ఎన్నారైలను ఇబ్బందులు పెడితే సహాయం చేసేందుకు భవిష్యత్‌లో ఎవ్వరూ ముందుకు రారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

విజయ సాయిరెడ్డి ఫేస్ బుక్ పోస్ట్ …

నిత్యం పేదలను ఆదుకునే రాష్ట్ర సర్కారు ఉండగా– ఎన్నారైలే ఏపీని కాపాడాలంటావు, ఎందుకు బాబూ! మతి భ్రమించిందా ? అని విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ పేదలను విదేశాల్లో స్థిరపడిన తెలుగు ఎన్నారైలు, రాష్ట్రంలోని ధనికులే కాపాడాలి’ అని కొత్త ఏడాది తొలిరోజు టీడీపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరులో పిలుపునివ్వడం ఆంధ్రులందరికీ తలవంపులు తెచ్చేలా ఉంది. తన పాలనలో పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలను గాలికి వదిలేసి తన కలల రాజధాని అమరావతి చుట్టూ ప్రదిక్షణలు చేశారు నారా వారు. ఆయన ఏలుబడిలో పేదలు నానా కష్టాలు పడ్డారు. ఆర్థికంగా, పాలనాపరంగా ఆదుకునే వ్యవస్థలు లేక చెప్పలేనన్ని యాతనలు అనుభవించారు ఆంధ్ర ప్రజలు. గత మూడున్నరేళ్లుగా పేదలు, ఇతర బడుగువర్గాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం లెక్కలేనన్ని పథకాలతో ఆదుకుంటోందని రాసుకొచ్చారు.

ప్రతి సందర్భంలోనూ నేనున్నానంటూ బలహీనులకు ఆసరాగా నిలుస్తోంది. ఒక వేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే పేద ప్రజానీకాన్ని ఇంకా మరింత మెరుగైన రీతిలో ఎలా బాగుచేస్తానో చంద్రబాబు చెప్పడం లేదు. ఆయనలో ఆ నమ్మకం కూడా కనిపించడం లేదు. 2023లో పేద ప్రజలు పైకి రావాలంటే ఎన్నారైలు, ఇక్కడి ధనికులు కలిసి సాయం చేయాలని 14 ఏళ్ల అనుభవం ఉన్న 72 సంవత్సరాల సీనియర్‌ నేత చంద్రబాబు అర్థించడం హేతుబద్ధంగా కనిపించడం లేదు. రాష్ట్రంలోని సహజ వనరులు, పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నులు, సుంకాల ద్వారా వచ్చే ఆదాయంతో ఏపీ సర్వతోముఖాభివృద్ధికి, సర్కారు సహకారం అవసరమున్న ప్రజల పురోగతికి కృషిచేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా ఎన్నారైలు ఇక్కడకొచ్చి పేదలను ఆదుకోవాలని ఆయన కోరడం లాజిక్కుకు అందని విషయం. రాష్ట్ర ప్రగతి, దీనజనోద్ధరణ విసయంలో ప్రభుత్వ కృషికి ప్రవాస భారతీయులైన తెలుగువారు కూడా చేయి అందిస్తే మంచిదే. అంతేగాని, ‘ఇక్కడ రాజకీయపక్షాల పని అయిపోయింది.

విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు వచ్చి రాష్ట్రంలోని బడగు బలహీనవర్గాలను ఆదుకోవాలి,’ అనే రీతిలో మాజీ ముఖ్యమంత్రి బాబు గారు గావుకేకలు పెట్టడం ఏపీ పరువు తీసే చర్య తప్ప మరోకటి కాదు. రాష్ట్రంలోని శ్రామికులు, పేద రైతులు, అన్ని బలహీన వర్గాలను ఆదుకుంటూ వారిని ప్రగతి పథంలో నడిపించే సత్తా ఉన్న ప్రభుత్వం చక్కగా పని చేస్తుండగా… ప్రధాన ప్రతిపక్ష నేత జనం ముందు బిక్క ముఖం పెట్టి ఇలా అర్థించడం టీడీపీ నేతలు, కార్యకర్తలకే విస్మయం కలిగిస్తోంది. సంపన్నులైన ఎన్నారై తెలుగువారి నుంచి పెట్టుబడులు, సహాయం కోరడంలో తప్పేమీ లేదు. కాని, ‘మీరొస్తే తప్ప ఇక్కడి దరిద్రం పోదు,’ అనే విధంగా చంద్రబాబు మాట్లాడడం ఆయనకే చెల్లింది. 1995–2004 మధ్య ముఖ్యమంత్రి హోదాలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌ నగరం ‘బ్రాండ్‌ వాల్యూ’ తెగ పెంచేశానని చెప్పుకునే ఈ ‘పెద్ద మనిషి’ నవ్యాంధ్ర ప్రదేశ్‌ పరువు ప్రతిష్టలు దిగజార్చేలా ఇలా మాట్లాడడం నిజంగా గర్హనీయం అని పోస్ట్ చేశారు. ఇప్పుడు ఒక ఘటన విషయంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు విభిన్నంగా స్పందించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version