Janasena – Tdp Meeting : ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో వైకాపాను గద్దె దించడమే లక్ష్యంగా జనసేన, తెదేపా పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓట్లను చీలనివ్వకుండా ప్రజా సంక్షేమం కొరకు ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసి పని చేస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటు పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఉమ్మడిగా చర్చలు జరుపుతున్నారు. తాజాగా విజయవాడ లోని నోవాటెల్ హోటల్ లో ఈ సమన్వయ కమిటీ రెండో సమావేశం జరిగింది.
కాగా ఈ భేటీలో ఉమ్మడిగా, పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా మీటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు తదితర సీనియర్ నేతలు… జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం… ఓటరు జాబితా అవకతవకలపై ఉమ్మడి పోరుకు 100 రోజుల ప్రణాళిక రూపకల్పన దిశగా చర్చలు సాగాయని నేతలు వెల్లడించారు.
అదే విధంగా రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై చర్చించి తీర్మానం చేశామని వెల్లడించారు. జనసేన, టీడీపీ రైతులకు అండగా నిలుస్తాయని, రాష్ట్రంలోని కరవు మండలాల్లో పర్యటించి రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా చేరేలా పోరాడాలని తీర్మానం చేసినట్టు వివరించారు. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి సమన్వయ కమిటీ సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు. వచ్చే సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో జరగనుంది.
కరవు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నా దేవుడి దయతో అంతా బాగుంది అని రాష్ట్ర పాలకుడు చెప్పడం పచ్చి అబద్ధమే. ఖరీఫ్ సమయంలో 32.42 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, లక్షల ఎకరాల్లో పంటలు ఎండి పోవడం అనేది వాస్తవం. 25 లక్షల ఎకరాలలో సాగు కూడా చేయలేదు. ప్రకృతి వైపరీత్యం వల్ల నెలకొన్న కరవుతోపాటు పాలకపక్షం నిర్లక్ష్య ధోరణులతోనూ రైతాంగం నష్టపోయింది. సకాలంలో సాగు నీరు కూడా ఇవ్వకపోవడంతో పశ్చిమ కృష్ణా డెల్టా ప్రాంతంలో పంటలు దెబ్బ తిన్నాయి. సాగు నీటి విడుదలలో, కాలువల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా ఉంది.
ఈ దుర్భర పరిస్థితుల్లో కరవు మండలాలు గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. నిబంధనల మేరకు కరవును లెక్కిస్తే 449 మండలాలను ప్రకటించాల్సి ఉంది. కేవలం 103 మండలాలనే కరవు మండలాలుగా గుర్తించడం రైతులను మోసగించడమే. వర్షాభావం మూలంగాను, సాగు నీరు అందకపోవడం వల్లా పంటలు కోల్పోయిన అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించాలనీ, రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలనే, ఇన్స్యూరెన్స్ మీద ఉన్న అయోమయాన్ని తొలగించి.. ఇన్స్యూరెన్సును తక్షణమే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ ఈ సమావేశం డిమాండ్ చేస్తుంది. జనసేన, తెలుగు దేశం రైతాంగానికి అండ నిలుస్తాయని.. కరవు మండలాల్లో పర్యటించి రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా చేరేలా పోరాడాలని తీర్మానం చేస్తున్నాం.