Pawan Kalyan Varahi Yatra : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుండి మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడత కూడా అంతకు మించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14న తూర్పు గోదావరి జిల్లాలో కత్తిపూడి జంక్షన్ వద్ద వారాహి యాత్ర తొలి విడతను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అదే నెల 30వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగింది. మరో వైపు ఈ ఏడాది జూలై 9న ఏలూరు నుండి రెండో విడత యాత్రను ప్రారంభించారు. అదే నెల 14న భీమవరంలో యాత్రను ముగించారు.
కాగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని పోలీసులు ప్రకటించారు. నేషనల్ హైవే రహదారి గుండా పవన్ కళ్యాణ్ ను విశాఖపట్టణంలోకి ప్రవేశిస్తే ట్రాఫిక్ కు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయంతో పోలీసులున్నారనే ప్రచారం సాగుతుంది.
నేటి పర్యటన నిమిత్తం ఉదయం గన్నవరం నుంచి విశాఖ బయలుదేరిన పవన్.. కొద్దిసేపటి క్రితమే వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పవన్ పర్యటనలో (Pawan Kalyan Varahi Yatra) భాగంగా ఆయనకు 500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అడుగడుగునా ఆంక్షలు విధించినప్పటికి.. సేనాని కోసం జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. పోలీసులు ఆంక్షల రీత్యా భారీ క్రేన్ లతో పూల మాలలు వేయవద్దని జనసేన పార్టీ అధిష్టానం కోరింది. జగదాంబ సెంటర్‌లో సభకు మాత్రమే అనుమతిని ఇచ్చిన పోలీసులు.. ర్యాలీలపై నిషేధం విధించారు. వాహన ర్యాలీలు, అభివాదం చేయవద్దని స్పష్టం చేశారు. భవనాలు, ఇతన నిర్మాణాలపై కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేన పార్టీదేనని పోలీసులు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడితే అనుమతి పొందినవారిదే బాధ్యత అని షరతు విధించారు.
పోర్ట్ రోడ్డు గుండా పవన్ కళ్యాణ్ ను విశాఖ పట్టణంలోకి ప్రవేశించేందుకు అనుమతించే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయాలపై పోలీసుల నుండి స్పష్టత లేదని జనసేన నేతలు చెబుతున్నారు. ఇవాళ్టి నుండి ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతుంది.