AP CM Jagan : ఏపీ సీఎం జగన్ తాజాగా చేసిన ఢిల్లీ పర్యటనపై ఎప్పటిలాగే అనేక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఎప్పటిలాగే జగన్ రాష్ట్రం కోసమే వెళ్లారంటూ భజన చేస్తుండగా.. ఏం జరిగింది అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పర్యటనలో భాగంగా జగన్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లతో భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జగన్, మోదీల భేటీ జరగ్గా 25 నిమిషాల పాటు ఇద్దరి మధ్య భేటీ కొనసాగినట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్ షా తో జగన్ సమావేశం సుదీర్ఘంగానే సాగింది. మోదీ కంటే ముందు అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాలు చర్చలు జరిపారు.
పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సీఎం కార్యాలయం వెల్లడించింది. అయితే మరోవైపు మాత్రం జగన్ ముఖ్యంగా ముందస్తు ఎన్నికల అంశం చర్చించినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా ఎన్నికలు జరిగేలా చూడాలని మోదీని జగన్ కోరినట్లుగా సమాచారం అందుతుంది. అలాగే త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో బీజేపీకి మద్దతుగా ఉండాలని మోదీ సూచించినట్లు టాక్ నడుస్తుండగా.. విజయ సాయిరెడ్డిని కేబినెట్ మంత్రిగా తీసుకునే ఛాన్స్ కనిపిస్తుందని చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఈ పర్యటన వెనుక అసలు ఆంతర్యం ఏంటి అని..