Andhra Pradesh: విశాఖపట్టణంలో తనకు భూములు లేవని, తాను విశాఖలో భూములు అమ్మలేదు. కొనలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు.
దసపల్లా భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేశామని, ప్రైవేట్ భూమిని 22 ఏ నుండి తీసేస్తే తప్పేం ఉందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 400 కుటుంబాలకు మేలు జరుగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు. విశాఖపట్టణానికి పరిపాలన రాజధాని రాకుండా కుట్రలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వికేంద్రీకరణ పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో కాపులు, వెలమలు, యాదవులు, కళింగులు ఎక్కువగా ఉన్నారన్నారు. కానీ భూములు మాత్రం చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో ఉన్నాయని విజయసాయిరెడ్డి విమర్శించారు.
కొన్ని పత్రికలు టీడీపీ కరపత్రం కంటే దిగజారిపోయాయని ఆయన ఆరోపించారు. ఎల్లో మీడియా తన పై తప్పుడు ప్రచారం చేస్తుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖపట్టణంలోని సీతమ్మధారలో తనకు త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ మాత్రమే ఉందన్నారు. తన కుమార్తె కుటుంబం 40ఏళ్లుగా ఫార్మా , ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఏస్టేట్ సహా అనేక రంగాల్లో ఉందన్నారు. తాను మీడియా రంగంలోకి ఎంటర్ అవుతున్నట్టుగా విజయసాయి రెడ్డి ప్రకటించారు. తాను ఇంతవరకు వ్యాపారం చేయలేదన్నారు. త్వరలోనే చానెల్ ను ప్రారంభిస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు.