Andhra Pradesh: అయ్యన్నపాత్రుడు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అయ్యన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని, నిబంధనలు పాటించలేదని అయ్యన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణకు హైకోర్టు అంగీకరించింది. అరెస్టు, కేసులో పొందుపరిచిన సెక్షన్లు, ఎన్‌ఓసీ తదితర విషయాల పై ఇరువురి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
అయితే కేసు డైరీని చూసి నిర్ణయం తీసుకుంటామని, కేసు డైరీని సమర్పించాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. రేపు ఉదయం 10.30 కల్లా కేసు డైరీ తమ ముందు ఉంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
ఎన్‌వోసీ ఫోర్జరీ చేశారనే అభియోగాలతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది. తమది కాని 2 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు ఆక్రమించారని తెలిపారు. ఈ కేసులో అయ్యన్నను A1 గా, ఆయన కుమారులు విజయ్ A2, రాజేశ్ A3 గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపింది.