Site icon Prime9

Vuyyuru Srinivas: గుంటూరు తొక్కిసలాట ఘటన.. ఏ1 నిందితుడు ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్

vuyyur srinivas arrested

vuyyur srinivas arrested

Vuyyuru Srinivas: గుంటూరులో జరిగిన చంద్రబాబు సభలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నాడు జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏ-1గా ఉయ్యూరు శ్రీనివాస రావు పేరుని నమోదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని శ్రీనివాస రావు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొన్నారు. కాగా కానుకల పంపిణీ సందర్భంగా భారీ మహిళలు తరలివచ్చారు. ఈక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉయ్యూరు శ్రీనివాస్ పై 304 సెక్షన్ కింద నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తొక్కిసలాట కారణంగా చనిపోయిన వారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నేడు అతన్ని అరెస్ట్ చేసి గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

ఇకపోతే ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. టీడీపీని, చంద్రబాబుని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నారంటూ విరుచుకుపడింది. ఈ విషాద ఘటనకు నిర్వాహకుల వైఫ్యలమే కారణమంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్న కందుకూరులో, ఇప్పుడు గుంటూరులో.. ఇలా తొక్కిసలాట ఘటనలు జరగడానికి కారణాలు ఏమై ఉంటాయో వివరణ ఇవ్వాలంటూ ఎస్పీని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. పోలీసులు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.

ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలోనే ఎందుకు చేపట్టారు? ఈ అంశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. కాగా, నిన్నటి ఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్కడికి 30వేల మంది ప్రజలు వచ్చినప్పుడు.. కనీసం 100 మంది పోలీసులు కూడా బందోబస్తుకు రాలేదని వారు అంటున్నారు. తాము భద్రత కల్పించాలని, అయితే నిర్వాహకుల వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version