Site icon Prime9

Janasena Party : ఫ్రీ సింబల్ గా “గాజు గ్లాసు”.. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం “జనసేన”కు ఎఫెక్ట్ అవుతుందా..?

election commission decision on janasena-party symbol

election commission decision on janasena-party symbol

Janasena Party : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్ళూ త్రికోణపు పోటీ ఉంటుందని ప్రజలు భావించగా.. జనసేన అధినేత పవన్ మాత్రం తన మాటకు కట్టుబడి ఉంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తి లేదని.. గెలిచాక సీఎం అభ్యర్ది ఎవరో నిర్ణయించుకుందాం అని ఖరాఖండిగా చెప్పేశారు. ఇప్పటికే అధికార పార్టీ వైఫల్యంతో ప్రజల్లో విపక్షాలకు మద్దతు పెరగడాన్ని గమనించవచ్చు. ముఖ్యంగా జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు ఇటీవల ఏపీలో చోటు చేసుకుంటున్న ఘటనలే ఉదాహరణలుగా చెప్పవచ్చు. దీంతో అధికార వైసీపీకి గట్టి పోటీ తప్పేలా లేదు అనుకుంటున్నా తరుణంలో ఎలక్షన్ కమిషన్ తాజా నిర్ణయం జనసేన అభిమానుల గుండెల్లో ఒకింత ఆందోళన కలిగిస్తుంది.

బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పేశారు. ఎన్నికల అనంతరం వైసీపీని గద్దె దించాక సీఎం అభ్యర్ధి ఎవరో అప్పుడు నిర్ణయిద్దాం అని తేల్చేశారు. దీంతో జనసైనికులంతా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరింత బలంగా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫ్యల్యాలను తీసుకెళ్తూ దూసుకుపోతున్నారు. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నిర్ణయంతో జన సైనికుల్లో ఒకింత కలవరం అయితే ఏర్పడవచ్చని భావిస్తున్నారు.

ఫ్రీ సింబల్ జాబితాలో జనసేన (Janasena Party) గాజు గ్లాసు..

దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా తమకు కేటాయించిన గుర్తును నిలుపుకోవాలంటే నిబంధనల ప్రకారం ఓట్ల శాతాన్ని తెచ్చుకోవాలి. అయితే జనసేన ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోటీ చేసిన స్థానాలు, ఓట్లు, పొందిన సీట్ల ఆధారంగా కామన్ సింబల్ దక్కలేదని చెబుతున్నారు. అదే విధంగా పార్టీ పలు ఉప ఎన్నికలకు దూరంగా ఉండటంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా తక్కువ చోట్ల పోటీ చేసింది. ఈ కారణం గానే జనసేన తన గుర్తును కోల్పోయిందని భావిస్తున్నారు.

తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్‌ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయం తెలిసిందే. మరి వచ్చే ఎన్నికల్లో ఈసీ జనసేనకు మళ్ళీ గాజు గ్లాస్ గుర్తు ఇస్తే పర్వాలేదు కానీ.. లేకపోతే భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. గాజు గ్లాస్ సింబల్ జనసేనదిగా భావించి వేరే వారికి ఓట్లు వేసే అవకాశం ఉంది. అయితే బద్వేలు ఉప ఎన్నిక సమయం లోనే జనసేన పార్టీ ఆ గుర్తును కోల్పోయింది. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చింది. దీంతో నవతరం పార్టీ అభ్యర్థికి ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. తమకు గాజు గ్లాస్ గుర్తు కొనసాగించాలని జనసేన ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

అయితే ఇప్పుడు ఏకంగా జనసేన గుర్తును ఫ్రీ సింబల్ గా చేర్చడంతో జనసేనకు కొంత మేర ఇబ్బందులు తప్పేలా లేవు. గతం లోనే కామన్ సింబల్ పైన జనసేన- ఎన్నికల సంఘం మధ్య సంప్రదింపులు జరిగాయి. అలానే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఉండగా.. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ గుర్తింపు పొందిన పార్టీలుగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను రిజర్వ్ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది.

 

Exit mobile version