Site icon Prime9

Polavaram Project: ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య ’పోలరణం‘

Polavaram

Polavaram

Harish Rao vs Ambati Rambabu: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ఇటీవల ఏపీలో ఉపాధ్యాయుల పరిస్థితి గురించి వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కామెంట్స్ చేశారు. అయితే, తనదైన స్టైల్‌లో హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అంబటి రాంబాబు.

మరో ఐదేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేరని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పోలవరం పనుల పురోగతి పై అక్కడి ఇంజనీర్లతో మాట్లాడానని తెలిపారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు ఒకేసారి ప్రారంభమయ్యాయని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ రెండింటిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి సాగునీరు కూడా అందిస్తున్నామన్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తి కాలేదన్నారు. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కాళేశ్వరంకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కాళేశ్వరం బ్యారేజీ మాత్రమేనని పోలవరం భారీ ప్రాజెక్ట్ అని అంబటి రాంబాబు గుర్తు చేశారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌, పోలవరం ప్రాజెక్ట్‌ను పోల్చడం సరి కాదన్నారు. గొప్పలు చెప్పుకోవడానికే హరీష్ రావు ఇలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, టీఆర్ఎస్‌ను తక్కువ చేసే ఉద్దేశం ఏమీ తమకు లేదన్నారు అంబటి రాంబాబు.

వరద ప్రభావం తగ్గడంతో పోలవరం పనులు పునఃప్రారంభిస్తున్నామని వెల్లడించారు. దిగువ కాఫర్ డ్యాం పనులు ఇప్పటికే ప్రారంభించామని అంబటి రాంబాబు గుర్తు చేశారు. కాఫర్ డ్యామ్‌ నిర్మాణం పూర్తి కాకుండా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డయాఫ్రంవాల్ నిర్మించడం చారిత్రాత్మక తప్పిదమని ఆయన చెప్పారు. మొత్తం మీద హరీష్ చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకు కారణమయ్యాయి. నీటిపారుదల ప్రాజెక్ట్‌ల సాక్షిగా మంత్రులు హరీశ్‌రావు, అంబటి రాంబాబు మధ్య మాటలు తూటాల్లా పేలాయి. దీనిపై మరింత మంది నాయకులు స్పందించే అవకాశం ఉంది. అయితే పరస్పరం సహకరించుకోవాల్సిన ఇరుగు పొరుగు రాష్ట్రాల మంత్రులు ఇలా ఎద్దేవా చేసుకోవడం ఏంటన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version