Amaravati: పోలవరం పై చర్చించేందుకు టీడీపీ అధినేత ఒకరోజు అసెంబ్లీకి రావాలని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కోరారు. శాసనసభకు వస్తే టీడీపీ చేస్తున్న సవాళ్ల పై చర్చిద్దామని ఆయన అన్నారు. డయాఫ‌్రం వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో ప్రజలకు శాసనసభ సాక్షిగా తెలియజేయాలని అంబటి రాంబాబు అన్నారు. శాసనసభకు రాను అని శపథం చేసిన మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చారు. కాబట్టి శాసనసభకు కూడా రావాలని అంబటి రాంబాబు ఆహ్వానించారు.
తాము ఉన్నది ఉన్నట్లుగానే చెబుతామని అబద్ధాలు చెప్పాల్సిన పని తమ ప్రభుత్వానికి లేదని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరానికి శాపంగా మారిందన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించడానికేనని అన్నారు. రియల్ ఎస్టేట్ వారు చేస్తున్న పాదయాత్ర అని అంబటి రాంబాబు అన్నారు. రెండు చేతులా సంపాదించుకోవడానికే ఈ పాదయాత్ర అని రాంబాబు అన్నారు. అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్ అని, అమరావతి ప్రజా రాజధాని కాదని నాడు జనసేన, సీపీఐ, సీ పీఎం నేతలు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు వారే పాదయాత్రకు డప్పులు కొడుతున్నారని తప్పుపట్టారు. పాదయాత్రలో ఒక్క రైతైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు 2018 కల్లా పోలవరం ఎందుకు పూర్తి చేయాలేదని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. గతంలో చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐవీఆర్ కృష్ణరావు ఒక పుస్తకం రాశారని గుర్తు చేసారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను దోచుకున్నారు. నారాయణ, గంటా శ్రీనివాస్ బంధువులు అసైన్డ్‌భూములను ప్రజల నుంచి పావలా, అర్ధరూపాయికి తీసుకున్నారని విమర్శించారు.