Srivari Brahmotsavalu: బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నేడు ముగిసాయి. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం నాడు శ్రీవారికి చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకస్వాములు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజన సేవను నిర్వహించారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పఠించారు. కాగా శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.రమణ దంపతులు, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రవిరంజన్, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: “దసరా” ఎలా మొదలయింది? దాని ప్రత్యేకతలేంటి?.. తెలుసుకుందామా..!