Telangana Political News: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని.. లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యంగా సినిమా రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ క్రమంలో తెలుగు హీరోలతో బీజేపీ వరుస భేటీలు జరుపుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే ఎన్టీఆర్‌తో సమావేశమయ్యారు. భేటీ మర్యాదపూర్వకమే అని చెబుతున్నా రాజకీయపరమైన చర్చ వచ్చి ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సెటిలర్ల ఓట్లు ఆకర్షించడంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్లు భావిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభ వరంగల్‌లో ఏర్పాటు చేశారు. అందులో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సినీ ప్రముఖులు కలిశారు. శంషాబాద్ విమానాశ్రయంలో సినీ నటుడు నితిన్ ఆయనతో సమావేశం అయ్యారు. నితిన్‌తో పాటు సినీ ప్రముఖులు రచయితలు నడ్డాను కలుసుకున్నారు. నితిన్‌ను పార్టీలో చేర్పించే ప్రయత్నం సాగుతోందని.. పరిశీలకులు చెబుతున్నారు. యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ప్రత్యేకించి తెలంగాణాకు చెందిన హీరో. దాంతో ఆయన్ని ఎలాగైనా బీజేపీ వైపు లాగాలన్న వ్యూహం రచించినట్లు విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలను ఇప్పటికే బీజేపీ నాయకులు సంప్రదించినట్టు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోన్న కమలనాథులు తెలుగునాట సినిమాకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారు. సినీ రంగంలో ఉన్న ప్రముఖులను ప్రచారానికి ఉపయోగించడంతో పాటు ఆసక్తి ఉన్నవారికి టికెట్లు కూడా ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. సీనియర్ నటుడు కృష్ణంరాజు మొదలుకొని నరేశ్, సాయికుమార్ దాకా ఎందరో నటులు బీజేపీతో అనుబంధం కలిగి ఉన్నవారే.జయప్రద కూడా ఇటీవలే బీజేపీలో చేరారు. సహజనటి జయసుధ కూడా చేరతారని ప్రచారం జరిగింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బలపడటానికి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. క్రీడారంగానికి చెందిన ప్రముఖులు కూడా నడ్డా భేటీ అయ్యారు. మిథాలీరాజ్‌తో నడ్డా సమావేశమయ్యారు. ఆమెతో చాలాసేపు మాట్లాడారు. మహిళా క్రికెటర్లకు దారి చూపి లేడీస్ కూడా తీసిపోరు అని నిరూపించిన ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్ అంటే యూత్ లో క్రేజ్ ఉంది. లేడీస్ లో ఫాలోయింగ్ ఉంది. హైదరాబాద్ నివాసి అయిన క్రికెటర్ మిథాలీ రాజ్ నిజానికి రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌కు చెందినవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు రాజస్థాన్ లో కూడా ఆమెతో ప్రచారం చేయించుకోవాలన్న ఎత్తుగడ ఏదో ఉంది అంటున్నారు పరిశీలకులు.నితిన్, మిథాలీతో జేపీ నడ్డా సమావేశాల్లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా స్వయంగా పాల్గొన్నారు. వీరి భేటిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్, మిథాలీరాజ్ – ప్రధాని మోదీ పాలనకు ఆకర్షితులయ్యారని.. త్వరలోనే వీరిద్దరూ ప్రధానిని కలిసే ఏర్పాట్లు చేస్తామన్నారు లక్ష్మణ్. పార్టీకి సేవలందించేందుకు నితిన్, మిథాలీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటిలోనూ రాజకీయ చర్చ జరిగి ఉండవచ్చని లక్ష్మణ్ చెప్పారు.
బీజేపీకి సినీ గ్లామర్ అందించేందుకే హీరోలతో భేటిలు అవుతున్నారని అర్థమవుతోంది. ఒప్పుకున్న వారితో వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయించడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలోనూ ఇలానే గ్లామర్ పాలిటిక్స్ అమలు చేసి బీజేపీ గెలిచింది. తెలంగాణలోనూ అదే అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద.. పేరున్న నోరున్న సెలిబ్రిటీలను తమ వైపునకు తిప్పుకునే వ్యూహానికి బీజేపీ అధినాయకత్వం పదును పెడుతోంది. తెలంగాణాకు వచ్చిన ప్రతీసారీ వివిధ విభాగాల ప్రముఖులను కలుస్తూ వారితో భేటీలు వేస్తూ మీడియా ఫోకస్ తమ వైపు ఉండేలా చూసుకుంటోంది. అయితే.. బీజేపీని కలుస్తున్న సెలిబ్రిటీలు అంతా ఆ పార్టీకి మద్దతుగా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.