Tarakaratna Died: తారకరత్న గుండెపోటు తీరని విషాదాన్ని మిగిల్చింది. 22 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందినట్లు బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు.
ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న ఇక లేరు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన మృతిచెందారు. తారకరత్నను కాపాడేందుకు నారాయణ హృదయాలయ వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తారకరత్నను బతికించలేకపోయినట్లు వైద్యులు తెలిపారు.
నందమూరి తారకరత్న జీవితం.. (Tarakaratna Died)
నందమూరి తారకరత్న 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. నందమూరి తారకరామారావు అయిదో కుమారుడైన మోహనకృష్ణ-శాంతి దంపతులకు మొదటి సంతానంగా తారకరత్న జన్మించారు. మోహనకృష్ణకు తారకరత్నతో పాటు రూప కుమార్తె కూడా ఉంది. చిన్నప్పటి నుంచి తాతయ్య రామారావు, బాబాయ్ బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగిన తారకరత్నకు.. తానూ సినిమాల్లోకి వచ్చి హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది. ఇంజనీరింగ్ సెకెండ్ ఇయర్‌లోనే తాను సినిమాల్లోకి వెళ్తానని తండ్రికి చెప్పగా..కొడుకు ఆసక్తి గమనించిన మోహనకృష్ణ ప్రోత్సహించారు 2001లో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఒకేసారి 9 సినిమాలను ప్రారంభించి అప్పట్లో ప్రపంచ రికార్డును సృష్టించాడు. అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ అది వరల్డ్ రికార్డే.
చిన్న వయసులోనే ఇండస్ట్రీకి
హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అన్ని సినిమాలతో రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ తారకరత్న విషయంలో ఇదే జరిగింది. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఆ సినిమాలోని పాటలు కుర్రకారుకు తెగ నచ్చేశాయి. అప్పట్లో ఈ సినిమా.. మ్యూజికల్ హిట్ అయింది. దానితో పాటు మరో 8 సినిమాలను కూడా ఒకే రోజు మొదలు పెట్టారు. కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి తారకరత్నవచ్చాడు. వచ్చీ రావడంతోనే తొమ్మిది సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అందులో చాలా వరకూ విడుదల కాలేదు. కొన్ని సినిమాలు పెద్ద నిర్మాణ సంస్థలు.. అగ్ర దర్శకులతోనూ తారకరత్న మొదలుపెట్టాడు. ఎందుకో అవి ముహూర్తంతోనే ఆగిపోయాయి.
ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలినవన్నీ ఆగిపోయాయి.
సినిమాల్లో మిశ్రమ ఫలితాలు
సినిమాల విషయంలో ఊహించిన ఫలితాలు రాకపోవటంతో తారకరత్న కనిపించకుండా పోయాడు. ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా సాహసించలేదు. చాలా కాలం తర్వాత రవిబాబు దర్శకుడిగా వచ్చిన అమరావతి సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. ఆ సినిమాలో తారకరత్న నటనకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డును ఇచ్చింది. తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ విలన్‌గా మెప్పించే ప్రయత్నం చేశాడు. మొత్తంగా 22 సినిమాల్లో నటించాడు. తారకరత్న చివరిగా నటించిన చిత్రం ఎస్-5. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమాలో తారకరత్న కీలకపాత్రలో నటించాడు.
మొత్తంగా 22 సినిమాల్లో నటించిన తారకరత్నకు ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన గుర్తింపు అందించలేదు. దీంతో కుటుంబంలోనే అతనికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సినిమాల సంగతి పక్కన పెడితే తారకరత్న వ్యక్తిగత జీవితం కూడా ఊహించని విధంగా సాగింది. తన వివాహంతో నందమూరి ఫ్యామిలీకే కాదు.. ఫ్యాన్స్‌కు కూడా షాకిచ్చాడు తారకరత్న. అప్పటికే పెళ్లి అయి విడాకులు తీసుకున్న అలేఖ్యరెడ్డిని.. 2012లో తారకరత్న వివాహం చేసుకున్నాడు. కులాంతర వివాహం చేసుకోవడంతో తారకరత్న కుటుంబానికి దూరం అయ్యారు. 2014లో జరిగిన తన సోదరి రూప పెళ్లికి కూడా తారకరత్న వెళ్లలేకపోయాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నాలుగేళ్లు కుటుంబానికి దూరం..
అనంతపురం జిల్లాకు చెందిన మధుసూదన్‌రెడ్డి కుమార్తె. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మేనకోడలును తారక్ పెళ్లాడాడు. తారకరత్న హీరోగా నటించిన ‘నందీశ్వర’ సినిమాకు అలేఖ్యరెడ్డి కాస్టూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి అయి విడాకులు తీసుకున్న అలేఖ్యను పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబీకులు ఆమోదించలేదు. దీంతో వారిద్దరూ 2012 ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు. 2013 డిసెంబర్ 21 వీరిద్దరికి పాప జన్మించింది. ఆ అమ్మాయికి.. నిష్క అని నామకరణం చేశారు.
2016లో తారకరత్న పుట్టినరోజు సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు వెళ్లి సెలబ్రేట్ చేశారు. అప్పటి నుంచి మళ్లీ తారకరత్న నందమూరి కుటుంబంలో కలిసిపోయాడు. ఇటీవల.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లోనూ తారకరత్న చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కుప్పం వెళ్లి మరీ అన్నీ తానై చూసుకున్నారు. ఇదిలా ఉండగా.. పార్టీ నేతలను కూడా కలుపుకుని పోతున్నారు. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సీటు కేటాయించాలని భావించారు. తారకరత్న టీడీపీ తరపున గతంలో ప్రచారం కూడా చేశారు. నందమూరి కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండే హీరోగా తారకరత్నకు పేరుంది. వ్యక్తిగతంగా తారకరత్న చాలా మంచివాడని అభిమానులు చెబుతున్నారు.