Site icon Prime9

Bandi Sanjay padayatra: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Jangaon district: జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ పాదయాత్రలో టిఆర్ఎస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యోగాలపై బండి సంజయ్ ను ప్రశ్నించారు. దీంతో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ ఇక ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాటకు దారితీయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. మరి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవరుప్పులలో టిఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించారని, దాడికి పాల్పడ్డారని బిజెపి నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకపక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలు జరుగుతుంటే, మరో పక్క టిఆర్ఎస్ గుండాలు దాడులకు తెగబడ్డారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు బిజెపి కార్యకర్తలకు రాళ్ల దాడిలో తీవ్రగాయాలు కావడంతో, ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్ కమిషనర్ తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ లా అండ్ ఆర్డర్ చేతగాని సిపి ఇంట్లో కూర్చోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక డీజీపీతో నేరుగా మాట్లాడిన బండి సంజయ్ బిజెపి కార్యకర్తల తలలు పగలగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉండేది ఇంకో ఆరు నెలలు మాత్రమే అని బండి సంజయ్ అన్నారు. తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని బండి సంజయ్ తెలిపారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక ఇదే సమయంలో దేవరుప్పల ఘటనతో బండి సంజయ్ తనకు పోలీసులు ఇచ్చిన సెక్యూరిటీని నిరాకరించారు. భద్రతా సిబ్బందిని సైతం ఉపసంహరించుకోవాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. తన భద్రతను బీజేపీ కార్యకర్తలే చూసుకుంటారని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Exit mobile version