Survey Report : మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యధికంగా ఆస్తులు ఉన్నవారు ఎవరు? అత్యల్ప ఆస్తులు ఉన్నవారు ఎవరు.. అత్యధికంగా కేసులు ఎవరిపై ఉన్నాయి.. అప్పులు ఎవరికి ఎక్కువ ఉన్నాయి వంటి వివరాలను తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) భారతదేశం లోని 28 రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని ముఖ్యమంత్రుల ఆర్థిక స్థితిపై ఓ నివేదికను విడుదల చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ కు ప్రస్తుతం ముఖ్యమంత్రి లేరు. ఈ లిస్ట్ ప్రకారం రూ.510 కోట్ల ఆస్తులతో సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అగ్ర స్థానంలో నిలిచారు. ఇక అదే విధంగా కేసులు ఎక్కువగా ఉన్న సీఎం లలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాప్ లో ఉన్నారు. రెండు విషయాల్లోనూ తెలుగు రాష్ట్రాల సీఎం లు టాప్ లో ఉండడం గమనార్హం.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులు ఉన్నారు. విశ్లేషించిన 30 మంది సీఎంలలో 29 మంది అంటే 97 శాతం కోటీశ్వరులని, ప్రతి సీఎంకు సగటు ఆస్తులు రూ.33.96 కోట్లు అని ADR పేర్కొంది. ఏడీఆర్ ప్రకారం ఆస్తుల పరంగా మొదటి మూడు స్థానాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ (రూ.510 కోట్లకు పైగా), అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన పెమా ఖండూ (రూ.163 కోట్లకు పైగా) రెండో స్థానంలో, ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ (రూ.63 కోట్లకు పైగా) మూడో స్థానంలో నిలిచారు.. అత్యల్పంగా ఆస్తులు కలిగిన ముగ్గురు సీఎంల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ (రూ. 15 లక్షలకు పైగా), కేరళకు చెందిన పినరయి విజయన్ (రూ. 1 కోటికి పైగా), హర్యానాకు చెందిన మనోహర్ లాల్ (రూ. 1 కోట్లకు పైగా) ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్ తెలిపింది.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఢిల్లీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ రూ.3 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది.
2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆస్తి విలువ రూ.23.55 కోట్లు కాగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆస్తి రూ.కోటికి పైగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్ (తమిళనాడు), బసవరాజ్ బొమ్మై (కర్ణాటక)లకు ఒక్కొక్కరికి రూ.8 కోట్లకు పైగా ఆస్తి ఉంది.
అత్యధిక అప్పులు, కేసులున్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయనకు రూ.8.88 కోట్ల మేర అప్పులు ఉన్నాయి.కేసీఆర్ పేరు మీద మొత్తం 64 కేసులు కూడా నమోదయ్యాయి. కేసుల్లో కేసీఆర్ తర్వాతి స్థానాల్లో ఎంకే స్టాలిన్ (47), జగన్‌మోహన్‌రెడ్డి (38), ఏక్‌నాథ్ శిందే (18), అరవింద్ కేజ్రీవాల్ (13) ఉన్నారు. అప్పుల్లో కేసీఆర్ తర్వాతి స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (రూ.4.99 కోట్లు), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (రూ.3.74 కోట్లు) ఉన్నారని వెల్లడించారు.