కైకాల సత్యనారాయణ: రేపు అధికాల లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు

కళామ్మతల్లి ముద్దుబిడ్డ, సినీనటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.

Kaikala Satyanarayana: కళామ్మతల్లి ముద్దుబిడ్డ, సినీనటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.  ఫిల్మ్‌నగర్‌లో కైకాల భౌతికకాయాన్ని మంత్రి సందర్శించి నివాళులర్పించారు.

కైకాల అంత్యక్రియలను ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. కైకాల మూడు తరాల నటుడు.. గొప్ప వ్యక్తి అని మంత్రి తలసాని కొనియాడారు. నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ విలన్‌గా.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారని తెలిపారు. దాదాపు 700పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆయన ఎంతగానో మెప్పించారని మంత్రి తలసాని అన్నారు.

కైకాల మరణం సమాజానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం ఎంపీగానూ కైకాల సేవలందించారని.. ఎన్టీఆర్‌ సైతం సత్యనారాయణ నటనను ఇష్టపడేవారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు వంటి దిగ్గజ నటుల చిత్రాల్లో తప్పనిసరిగా కైకాల ఉండేవారని, ఏ పాత్ర పోషించినా అందులో లీనమైపోయి నటించేవారని ఆయన అన్నారు. అలాంటి గొప్పవ్యక్తి మరణించడం బాధాకరమని, ఆయన కుటుంబానికి మంత్రి తలసాని తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు కైకాల పార్థివదేహాన్ని మహా ప్రస్థానానికి తరలిస్తామని.. అనంతరం ప్రభుత్వపరంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తలసాని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కైకాల సత్యనారాయణ: యముడికి కేరాఫ్ అడ్రస్ గా కైకాల సత్యనారాయణ