Droupadi Murmu: బ్రిటన్ రాణి అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి

భారత ప్రభుత్వం తరఫున ఎలిజబెత్‌-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ వెళ్లారు. ఆదివారం ఉదయం ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు.

Droupadi Murmu: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 అధికారిక అంత్యక్రియలను రాజప్రసాదం సోమవారం(సెప్టెంబర్ 19వ తేదీన) జరుపనుంది. రాణి మృతదేహాన్ని లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో ప్రజల సందర్శనార్థం సోమవారం ఉదయం 6.30 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం.. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియలు ప్రారంభమవుతాయని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

కాగా రాణి అంత్యక్రియల కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యి ఘన నివాళులు అర్పించనున్నారు. దీనిలో భాగంగానే.. భారత ప్రభుత్వం తరఫున ఎలిజబెత్‌-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ వెళ్లారు. ఆదివారం ఉదయం ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు.

ఇకపోతే, రాణి అంత్యక్రియల కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీ సమేతంగా హాజరుకానున్నారు. అంతే కాకుండా ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌, టర్కీ ఎర్డోగన్‌, బ్రెజిల్‌ జైర్‌ బోల్సోనారో, బ్రెగ్జిట్‌ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్‌ యూనియన్‌, యూరోపియన్‌ మండలి ప్రతినిధులకు కూడా రాజకుటుంబీకులు ఆహ్వానం పంపారు. వీళ్లతో పాటు 56 కామన్‌వెల్త్‌ దేశాల ప్రతినిధులు సైతం ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరుకానున్నారు. కాగా రాణి అంత్యక్రియల కార్యక్రమానికి మయన్మార్, రష్యా, బెలారస్ దేశాల నేతలకు రాజ కుటుంబం ఆహ్వానం పంపించలేదు.

ఇదీ చదవండి: Nepal: నేపాల్ లో కొండచరియలు విరిగిపడి 17మంది మృతి