MLC Ananthababu Bail: హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీఅనంతబాబుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా బెయిల్ షరతులను మాత్రం కింది కోర్టు విధించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉంటున్నారు. అయితే బెయిల్ కోసం అనంతబాబు అనేక ప్రయత్నాలు చేశారు. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అక్టోబర్ నెలలో కొట్టివేసింది. దీనితో అనంతబాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
గత విచారణలో అనంతబాబును అరెస్టు చేసి 90 రోజులు దాటిపోయిందని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేయడం లేదన్నారు. ఫోరెన్సిక్ నివేదికలని మరో కారణం చెప్పి చార్జిషీట్ దాఖలు చేయడం లేదన్నారు. ఆగస్టు 26న ట్రయల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నిందితుడికి మరో 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలని.. ఈలోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారన్నారు.
కానీ ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనంత బాబు డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు అర్హుడని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతబాబు తరపు లాయర్ వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.