Fire Accident: దుర్గామాత పూజలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో చోటుచేసుకుంది.
యూపీ భదోహిలోని దుర్గామాత మండపంలో భక్తులు అమ్మవారికి వైభవంగా పూజలు జరుపుతున్నారు. కాగా పూజలో భాగంగా దుర్గామాతకు హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానితో మండపం పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాద సమయంలో మండపంలో దాదాపు 150 మంది భక్తులు ఉన్నారని జిల్లా మేజిస్ట్రేట్ గౌరంగ్ రాఠీ పేర్కొన్నారు. దుర్గామాత మండలంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారని వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: మరో ప్రాణం తీసిన లోన్ యాప్స్