Site icon Prime9

Anil Kumar Yadav : తాతకోసం తొడ కొట్టాలి.. సౌండ్ లేకుండా ట్వీట్లు ఎందుకు? .. అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav

Anil Kumar Yadav

Anil Kumar Yadav :ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పేరు మార్పుతో ఎన్టీఆర్ గొప్పతనం తగ్గిపోదని, అదే సమయంలో వైఎస్ఆర్ గొప్పతనం పెరగబోదంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. దీనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించినప్పుడు, ఆయనకి వెన్నుపోటు పొడిచినప్పుడు కుటుంబసభ్యులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అనిల్ ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదు కాని మనవళ్లు, ట్వీట్లు.. అంటూ పరోక్షంగా తారక్ పై సెటైర్లు వేసారు.

పోనీ అప్పుడు ఆ హీరో (ఎన్టీఆర్) చిన్నపిల్లోడైతే.. ఇప్పుడు పెద్దోడయ్యాడు కదా, పార్టీని నారావారి చేతుల్లోనుంచి లాగేసుకుని, నందమూరి వారి చేతుల్లో ఉంచుకోవచ్చుకదా అని ప్రశ్నించారు.ముందు తాత కోసం ఆయన తొడకొట్టాలని, సౌండ్ లేకుండా ట్వీట్లు ఎందుకని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు పలికే అర్హత టీడీపీ నాయకులకు లేదన్నారు. ఎన్టీఆర్ కి తామెప్పుడూ గౌరవం ఇస్తామని చెప్పారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పని నోళ్లు, ఇప్పుడు హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చగానే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాయని మండిపడ్డారు.

104, 108 లను ఏర్పాటు చేసి, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన వైఎస్ఆర్ పేరుని టీడీపీ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ నుంచి ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు అనిల్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా ఎందుకు మార్చారని అడిగారు. ఇప్పుడు వారంతా హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఎందుకు గింజుకుంటున్నారని అనిల్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలన్నిటికీ చంద్రన్న పేరు పెట్టుకున్నారని, చంద్రన్న బీమా, చంద్రన్న తోఫా, చంద్రన్న కానుక అంటూ హడావిడి చేశారని, అప్పుడు ఎన్టీఆర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని అందుకే కొత్త జిల్లాకు ఆయన పేరు పెట్టామని తెలిపారు.

Exit mobile version