IPL: వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇటీవలే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ అతన్ని రిలీజ్ చేసి, బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. దానితో ఐపీఎల్ 2023కి పొలార్డ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇదిలా ఉంటే మరో విండీస్ దిగ్గజం ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇకపై ఐపీఎల్‌లో కనిపించడని తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మినీ ఆక్షన్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేయడానికి
నవంబర్ 30తో గడువు ముగిసింది. ఐపీఎల్ మినీ వేలంలో 991 ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో వెస్టిండీస్ నుంచి 33 మంది ప్లేయర్లు
ఉన్నారు. విండీస్ జాబితాలో డ్వేన్ బ్రావో పేరు లేదని తెలుస్తోంది. దానితో డ్వేన్ కూడా ఐపీఎల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.
బ్రావో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముంబై ఇండియన్స్‌తో మొదలుపెట్టి.. ఆ తర్వాత 2011లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కలిశాడు. అప్పటి నుంచి చెన్నై తరఫున అద్భుతంగా రాణించాడు. 2011, 2012, 2021ల్లో ఐపీఎల్ ట్రోఫీ బ్రావో ముద్దాడాడు. తన కెరీర్‌లో 161 ఐపీఎల్ మ్యాచులు ఆడిన బ్రావో.. 158 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2022లో 10 మ్యాచుల్లో 16 వికెట్లు తీసుకున్నాడు. దానితో అప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ పేరుమీద ఉన్న రికార్డును అతడు బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ 2023 కోసం కేవలం 14 మంది ఆటగాళ్లను మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. డ్వేన్ బ్రావోతో పాటు రాబిన్ ఊతప్ప, నారాయణ్ జగదీశన్, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే లాంటి స్టార్ ప్లేయర్లను కూడా వదిలేసింది. వీరిలో ఊతప్ప కొన్ని రోజుల క్రితమే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. బ్రావో కూడా అదే బాటలో నడుస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇకదీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.
ఇదీ చదవండి: శాంసన్ వేచి చూడాల్సిందే.. పంత్ ను వెనుకేసుకొచ్చిన థావన్