DC vs RCB : ఐపీఎల్ 2023 లో భాగంగా ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ అనూహ్య విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో ఆర్‌సీబీ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (22: 14 బంతుల్లో 3×4, 1×6) తక్కువ స్కోరుకే ఔటైపోయినా ఫిలిప్ సాల్ట్ (87: 45 బంతుల్లో 8×4, 6×6) విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగాడు. తొలి వికెట్‌కి 5.1 ఓవర్లలోనే 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సాల్ట్.. వార్నర్ ఔట్ అయ్యాక మిచెల్ మార్ష్ (26;’ 17 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) తో కలిసి రెండో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అతను ఔట్ అయినప్పటికీ రిలీ రొసౌ (35 నాటౌట్: 22 బంతుల్లో 1×4, 3×6) నుంచి చక్కటి సపోర్ట్ తోడవ్వడంతో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. చివర్లో అక్షర్ పటేల్ (8 నాటౌట్: 3 బంతుల్లో 1×6) తన వంతు పాత్ర పోషించాడు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్, కరణ్ శర్మ, హర్షల్ పటేల్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు. ఏప్రిల్ 15న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని 23 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓడించగా.. ఢిల్లీ ఇప్పుడు బెంగుళూరును ఓడించి రివేంజ్ తీర్చుకుంది.
అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లి (55; 46 బంతుల్లో 5 ఫోర్లు), మహిపాల్ లోమ్రోర్(54 నాటౌట్; 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) లు అర్ధ శతకాలతో మెరువగా డుప్లెసిస్(45; 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్ లలో మాక్స్‌వెల్(0), దినేశ్ కార్తిక్(11) తక్కువ స్కోర్ కి పరిమితం అయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ రెండు వికెట్లు పడగొట్టగా ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.
#QilaKotla mein yeh jeet… ekdum feel aagayi ❤pic.twitter.com/GMajLPGsUk
— Delhi Capitals (@DelhiCapitals) May 6, 2023
ఢిల్లీ క్యాపిటల్స్ గత ఐదు మ్యాచుల్లో 4 విజయాలతో గట్టిగానే కమ్ బ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ మాత్రం దాదాపు చివరిదాకా క్రీజులో నిలబడి.. విలయతాండవం చేశాడు. 45 బంతుల్లోనే 87 పరుగులు చేశాడంటే.. ఎలా చెలరేగి ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఆర్సీబీ బౌలర్లు ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయారు. బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఇంకా 20 బంతులు మిగులుండగానే ఆ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఢిల్లీ జట్టు ఛేజ్ చేసింది అంటే వారి వైఫల్యం అర్ధం చేసుకోవచ్చు.