Site icon Prime9

Plastic control: ప్లాస్టిక్ నియంత్రణ ఒట్టిమాటే…పర్యావరణమా! భాగ్యనగరంలో నీ జాడెక్కడ?

In Bhagyanagar, plastic control is a no-brainer

In Bhagyanagar, plastic control is a no-brainer

Hyderabad: దేశ వ్యాప్తంగా ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వ్యక్తిగత అజెండాతో ముందుకు పోతున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందులో విఫలం చెందుతున్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోని ప్రసిద్ధి నగరాల్లో ఒకటైన హైదరాబాదు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ ను కట్టడి చేసేందులో ప్రభుత్వం విఫలం చెందింది. దీంతో భాగ్యనగరంలో ప్లాస్టిక్ భూతం, పర్యావరణాన్ని శరవేగంగా కబలిస్తుంది. నియంత్రించేందుకు తీసుకొచ్చిన చట్టాలు ప్రజలకు చుట్టాలుగా మారడంతో ట్విన్ సిటీస్ లో నిషేదిత ప్లాస్టిక్ ను విచ్చలవిడి వినియోగంపై ప్రైం9 న్యూస్ ప్రత్యేక కధనం…

ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019లో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారతదేశాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి విముక్తి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జూలై 1 నుండి, తక్కువ వినియోగాన్ని కలిగి ఉండే వినియోగ ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల జాబితాలో ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, కత్తిపీట (ఫోర్క్స్, స్పూన్లు, కత్తులు, స్ట్రాస్, ట్రేలు వంటివి), స్టిరర్లు, ప్లాస్టిక్ కర్రలతో కూడిన ఇయర్‌బడ్‌లు, బెలూన్‌ల కోసం ప్లాస్టిక్ స్టిక్‌లు, ప్లాస్టిక్ జెండాలు, మిఠాయి కర్రలు, ఐస్‌క్రీం ఉన్నాయి. కర్రలు, అలంకరణ కోసం ఉపయోగించే థర్మాకోల్, స్వీట్ బాక్స్‌ల చుట్టూ ఫిల్మ్‌లు చుట్టడం, ఆహ్వాన కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ లేదా పివీసి బ్యానర్‌లను ఇందులో చేర్చారు.

అయితే భాగ్యనగరంలో తక్కువ మైక్రాన్లు కల్గిన ప్లాస్టిక్ సంచుల నిషేదంపై ప్రభుత్వ చర్యలు శూన్యంగా మారాయి. దీంతో పలు పూలు, కూరగాయలు, పండ్ల మార్కెట్లతోపాటు హోటళ్లు, చిరు వ్యాపారులు ప్లాస్టిక్ ను విరివిగా వినియోగిస్తున్నారు. వినియోగదారులకు అంటగడుతున్నారు. నగరంలోని ప్రధాన మార్కెట్లలో ఒకటైన గుడిమల్కాపూర్ లోని కూరగాయాలు, పూల మార్కెట్లలో బహిరంగానే నిషేదిత ప్లాస్టిక్ సంచులను విక్రయిస్తున్నారు. వ్యాపారులు సైతం వినియోగదారులకు కవర్లలో అమ్మకాలను ఇట్టే సాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా గుడ్డ సంచుల్లో నిల్వ ఉంచాల్సిన కాయగూరలను సైతం హానికరమైన ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారు. మార్కెట్టులో ఎటు చూసినా ప్లాస్టిక్ మయంగా మార్చేశారు. వినియోగదారులు సైతం దుకాణాదారులు ప్లాస్టిక్ కవర్లు ఇస్తారులే అన్న ధోరణిలో చేతులు ఊపుకుంటూ కొనుగోళ్లకు వస్తున్నారు. ఒక్క గుడిమల్కాపూర్ మార్కెట్టులోనే నిత్యం 200కేజీలకు పైగా నిషేధిత ప్లాస్టిక్ ను వ్యాపారులు వినియోగిస్తున్నారు.

కట్టడి చేయాల్సిన గ్రేటర్ మునిసిపల్ సిబ్బంది మామూళ్ల మత్తులో తూలడంతో ప్లాస్టిక్ నిషేధం అమలు పేరుకు మాత్రమే పరిమితమైంది. ఆచరణకు నోచుకోక పోవడంతో నగరం కాలుష్యానికి గురౌతుంది. మ్యాన్ హోల్స్, మురికి కాలువలు ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండి మూసుకుపోతున్నాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లపై మురికి నీరు చేరి ప్రజలను రోగాలకు నిలయంగా మారుస్తున్నాయి. ఇకనైనా ప్లాస్టిక్ భూతాన్ని కట్టడి చేయకపోతే పర్యావరణ ముప్పుకు మనమే కారకులుగా మిగిలుతాం. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొనాల్సి అవసరం ఉంది.

ఇది కూడా చదవండి: Hyderabad: మృత్యుకూపాల ద్వారాలుగా మురికి నాలాలు.. ఆదమరిస్తే అంతే సంగతులు

Exit mobile version
Skip to toolbar