Site icon Prime9

Hyderabad: మృత్యుకూపాల ద్వారాలుగా మురికి నాలాలు.. ఆదమరిస్తే అంతే సంగతులు

Dirty canals are the gates of death pits

Dirty canals are the gates of death pits

Prime9Special: చినుకు పడితే చిత్తడి చిత్తడిగా ప్రధాన రహదారులు. పొంగి పొర్లే మురికి నాలాలు. ఎటు చూసిన బురదమయం. అంతకుమించి ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నాలాలు. ఇది భాగ్యనగరంలో నిత్యం చోటు చేసుకొనే తంతు. అంతేనా అదమరిస్తే ప్రాణాలు గుట్టక్కమనడం ఖాయమనుకునేలా, తెరుచుకున్న మురికి నాలాలు మృత్యుకూపాలకు దారిచూపుతూ నగరవాసులను బెంబేలెత్తిస్తున్న వాస్తవాల పై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కధనం.

గడిచిన రెండు నెలలుగా భాగ్యనగరాన్ని వానలు ముంచెత్తాయి. దీంతో పల్లపు ప్రాంతాలు నీటిమయంతో మునిగిపోయాయి. మురికి కాలువల్లోకి నీరు వెళ్లేందుకు వీలులేక ఎక్కడి నీరు అక్కడే నిలిచి బురదమయంగా మారిపోయాయి. మెహదీపట్నం, పంజగుట్ట నుండి అమీర్ పేట, ఇఎస్ఐ, ఎఱ్ఱగడ్డ, మూసాపేట, హయద్ నగర్ తోపాటు ములక్ పేట, సికింద్రాబాద్, బేగంపేట, చిలకల గూడ, బోయనపల్లి, తిరుమల గిరి, మారేడు పల్లి, దిల్ షుక్ నగర్, మల్కాజ్ గిరి, బాలానగర్, తదితర నగర ప్రాంతాలు వర్షపు నీటితో నిండి చెరువులను తలిపిస్తున్నాయి.

వీటన్నింటికి ప్రధాన కారణం వర్షపు నీరు వెళ్లేందుకు వీలులేని మురికి నాలాల తీరే ప్రధానం. నగరంలో పలు ప్రాంతాల్లోని మురికి నాలాలు పూడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఛిధ్రమైన నాలాలతో వర్షపు నీరు వెళ్లేందుకు వీలులేక నిండిపోతున్నాయి. ఇండ్ల మధ్యలో డ్రైనేజి నీరు చేరి దుర్ఘంధాన్ని వెదజల్లుతున్నాయి. చిన్నపాటి వర్షానికే లోపల ప్రాంతాల నుండి ప్రధాన రహదారులకు చేరుకొనేందుకు ప్రజలు, వాహనదారులు యుద్ధాలు చేస్తున్నారు. ప్రణాళికలు లేని అధికారుల తీరుతో కొత్తగా నిర్మించిన రహదారులు సైతం వర్షపు నీరు భారీగా నిలిచిపోతున్నాయి. కొద్ది పాటి వర్షానికే కొండాపూర్ ఆర్టీవో కార్యాలయం మీదుగా నగరంలోని నాలుగు ప్రధాన మార్గాలవైపుకు చేరుకొనే ప్రధాన రహదారి (రింగ్ రోడ్డు) చివర భాగాన వర్షపు నీరు ఒకటిన్నర అడుగు మేర నిలిచి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దే ప్రతిపాదనల్లో భాగంగా తీసుకొన్న జీహెచ్ఎంసీ చర్యలు కూడా ప్రజలను ఇబ్బందులు పాలుచేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్డు మద్యభాగంలో తవ్వి కొత్తగా మురికి నాలాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నుండి రావాల్సిన కాంట్రాక్ట్ బకాయిలు సరిగా అందకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. చినుకు పడితే గుంటలుగా ఏర్పడిన రహదారుల మీదుగా ఇంటి పరిసరాలకు చేరుకొనేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పలుచోట్ల నీరు వెళ్లేందుకు అవకాశం లేక రోడ్లన్నీ వరదనీటిని తలపిస్తున్నాయి.

పలుచోట్ల మురికి నాలాలు ధ్వంసం కావడంతో వాటిని జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు చందనగర్ మీదుగా అమీన్ పూర్ చేరుకొనే క్రమంలో నాలుగు విద్యా సంస్ధలు ఉన్నాయి. దీంతో ఉదయం సమయంలో ఆ మార్గంలో విద్యార్ధులు, చిన్నారులు అధిక సంఖ్యలో పయనిస్తుంటారు. మారుతి హిల్స్ లోపలకు వెళ్లే కూడలి ప్రాంతంలోని ఓ మురికి నాలా మూత లేకుండా అలా ఉండిపోయింది. అటువైపుగా వచ్చే స్కూలు విద్యార్ధులు, వాహనదారులు ఏమరు పాటుగా ఉంటే వారి ప్రాణాలకు ముప్పు తప్పదు. ఇలా నగరంలోని పలు ప్రాంతాల్లోని మురికి నాలాలు తెరుచుకొని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సీజన్ వ్యాధులకు కూడా మురికి నాలాలే ప్రధానం. ఎందుకంటే కొన్న చోట్ల మంజీర నీటి పైపు లైనుల్లో ఏర్పడ్డ లీకుల్లోకి మురికినీరు చేరుతుంది. దీంతో నీరు కలుషితంగా మారి అమాయక ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.

ఇకనైనా జీహెచ్ఎంసీ అధికారులు వాస్తవాలను గుర్తించి, ప్రజలకు యమపాశాలుగా తలపిస్తున్న మురికి నాలాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మురికి నీటి ప్రాంతాల్లో నివసించే పౌరులు స్థానిక ప్రజా ప్రతినిధులను నిలదీయాలి. మన జీవితం-మన చేతుల్లోనే ఉంది. ఆ దిశగా ప్రజలు చూపులు సారిస్తేనే భాగ్యనగరంలో జీవించగలం. ఒక విధంగా ప్రాణాలను రక్షించుకోగలమని గుర్తించాలి.

ఇది కూడా చదవండి: KA Paul: భాగ్యనగరంలో పారిశుద్ధ్యం అధ్వానం.. దరిద్ర తెలంగాణగా పేర్కొన్న కేఏ పాల్

Exit mobile version