Dasara: దసరా వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తుంటారు. జగన్మాతను వివిధ రూపాల్లో తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజించి పదోరోజున దసరా వేడుకలను నిర్వహిస్తుంటారు. కాగా ఈ దసరా పండుగ అంటుంటాం కానీ అసలు ఈ పండుగకు దసరా అనే ఎందుకు పేరువచ్చింది. అనేది మీకు తెలుసా.. తెలియదా అయితే ఈ కథనం చదివెయ్యండి.
పది తలల రావణాసురిడిని హరించిన శ్రీరాముడి దసరా
దసరా అంటే దస్ + హరా అని, అంటే సీతాపహరణ గావించిన రావణాసురుని పదితలలు శ్రీరాముడు సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా దీనిని వ్యవహరిస్తుంటారు. “అశ్వనీ” నక్షత్రంతో కలసివచ్చిన పూర్జిమమాసాన్నే “ఆశ్వీయుజమాసం” అంటారు. ఈ రావణ సంహారం సరిగ్గా ఆశ్వయుజమాసం తొమ్మిది రోజుల సుదీర్ఘ యుద్ధం అనంతరం నవమి తిథినాడు జరిగిందని అందువల్లే దీనిని “దసరా వైభవం”గా అనగా పదిరోజుల వైభవంగా దశమినాడు జరుపుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతుంది.
దశ పాపాలను హరించిన దసరా
దసరాకు మరోపేరు ఉంది. ‘దశహరా” అంటే! పది పాపాలను హరించేది అని చెప్తుంటారు దైవజ్ఞలు. శరదృతువుకు వెంటనే వర్షరుతువు ఈ రెండు రుతువుల్లోని వాతావరణ మార్పుల వల్ల క్రిమికీటకాలు పెరుగుతాయి. ఫలితంగా యావత్ ప్రజానికం ఈ ఋతువులో ఎక్కవగా రోగాల బారిన పడతారు. ఈ బుుతువులో విస్తరించే క్రిమికీటకాలకు “యమదంష్ట్రము”లని పేరు. జగన్మాత అయిన దేవి మహిషాదిజంతువులను జయించడంలో అంతరార్థమిదే అని దేవీభాగవతం వివరిస్తోంది. ఆరోగ్య ప్రాప్తికి ఈ రెండు ఋతువులలోను నవరాత్రి ఉత్సవాలు జరపాలని శాస్త్రం వెల్లడిస్తోంది.
పాండవులు విజయం సాధించిన దశమిగా
పాండవులు అజ్ఞాతమాసం ముగించుకుని వచ్చి అశ్వయుజమాసంలో తొమ్మిదిరోజులపాటు కౌరవులతో యుద్ధం చేసి దశమి రోజు విజయం సాధిస్తారు రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు. ఈ సందర్భంగా పదోరోజున విజయ దశమి అని జరుపుకుంటారని మహాభారతం ప్రకారం తెలుస్తోంది.
దసరా ఉత్సవాల వేల అమ్మవారిని దశరూపాల్లో పూజిస్తారు. ఒక్కోరోజు ఒక్కో అలంకరణ రూపంలో అమ్మవారిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సంప్రదాయాల ప్రకారం దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. మరి ఇలా వేర్వేరు రూపాల్లో కొలువైన అమ్మవారి పేర్లతోనే చాలా నగరాలు వెలిశాయి. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.
అమ్మవారిపేరు మీదుగా వెలసిన నగరాలివే..
ముంబై- ముంబాదేవి
- మన దేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా అమ్మవారి పేరు మీదనే వెలిసింది. ఆదిపరాశక్తి అంశ అయిన ముంబా దేవి పేరు మీద ఈ నగరానికి ఆ పేరు వచ్చింది. ముంబా దేవిని అక్కడి ప్రజలు ముంబా ఆయి ( మరాఠీలో అమ్మ అని అర్థం )గా పిలిచేవారు. ఆ అమ్మవారి పేరు మీదనే ఆ నగరానికి ముంబై అని పేరొచ్చింది. సౌత్ ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు రాతి రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
కోల్ కతా- కాలికా క్షేత్ర
- దసరా ఉత్సవాలు.. దుర్గా దేవి శరన్నవరాత్రులు అంటే ఎక్కువగా గుర్తొచ్చేది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతానే. అలాంటి కోల్‌కతాకు ఆ పేరు రావడం వెనుక కూడా ఓ కారణం ఉందట. కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి వచ్చిందట. కాలిక్ క్షేత్ర అంటే కాళికా దేవి కొలువైన స్థలం అని అర్థం.
అలాగే కాళీ ఘాట్ అనే పదం నుంచి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.
సిమ్లా- శ్యామలా దేవి
- మంచు దుప్పటి కప్పేసినట్టుగా ఉండే సిమ్లా నగరం పేరు వెనుక కూడా ఇలాంటి కథనే ఒకటి ఉంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం సాక్షాత్తు కాళీ మాత శ్యామలా దేవిగా ఈ ప్రాంతంలో వెలిసింది. ఇక్కడి దుర్గా మాత శ్యామ వర్ణంలో చూడచక్కని సుందర రూపంతో కనిపిస్తుంది అందుకే ఆ దేవిని శ్యామలా దేవిగా పిలుస్తున్నారు. ఆమె పేరు మీదనే ఆ నగరానికి సిమ్లా అనే పేరొచ్చింది.
మంగళూరు- మంగళాదేవి
- కర్ణాటక ప్రాంతంలోని మంగుళూరుకు ఆ ప్రాంతంలో కొలువైన మంగళాదేవి పేరు మీదే ఆ నగరానికి మంగళూరు అని పేరొచ్చిందని, ఇక్కడి మంగళా దేవి ఆలయాన్ని శ్రీ మహా విష్ణువు అవతారమైన పరశురాముడు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
చంఢీగడ్- చండీ దేవి
- పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్. ఇక్కడ ఉన్న పంచకుల జిల్లా కల్క పట్టణంలో చండీ దేవి ఆలయం ఉంది. ఈ చండీ మందిర్ అక్కడ చాలా ఫేమస్. దీంతో అక్కడి అమ్మవారి పేరు మీదనే చండీగఢ్ అని పేరు పెట్టారు. చండీ అంటే పార్వతీదేవి ఉగ్ర రూపమైన చండీ మాత అవతారం. గఢ్ అంటే కొలువైన స్థలం అని అర్థం
- త్రిపుర- త్రిపుర సుందరి
- మైసూర్ (కర్ణాటక)- మహిషాసుర మర్దిని
- అంబ జోగె( మహారాష్ట్ర)- అంబ జోగేశ్వరి
- కన్యాకుమారి ( తమిళనాడు )- కన్యాకుమారి దేవి
- తుల్జాపూర్ ( మహారాష్ట్ర )- తుల్జా భవానీ
- అంబాలా (హర్యానా )- భవానీ అంబా దేవి
- సంబల్‌పుర్ ( ఒడిశా )- సమలై దేవి
ఇకపోతే దసరా ఉత్సవాలకు మైసూరు ప్రసిద్ధి గాంచింది. కాగా మైసూరులో మొట్టమొదట 15వ శతాబ్ధంలో విజయనగర రాజులు దసరా ఉత్సవాలు జరిపినట్టు ఆధారాలున్నాయి. కాగా కాలక్రమేనా విజయనగర రాజుల పతనం తరువాత మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. రాజా ఉడయార్ I (1578-1617) 1610లో ఈ ఉత్సవాలను మొదటగా ప్రారంభించారు. అయితే 1805లో కృష్ణరాజ ఉడయార్ III సమయం నుండి దసరా సమయంలో మైసూరు ప్యాలస్ లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ తరువాత అది ఆచారంగా మారిపోయింది. పదిరోజులపాటు మైసూరు ప్యాలెస్లో నిర్వహించే చాముండీ పూజ, ఆయుధ పూజ చాలా ఫేమస్. కాగా ఈ పదిరోజులు మైసూర్ ప్యాలెస్ మరియు చాముండీ కొండ దీప కాంతుల వెలిగిపోతుంది. వీటిని చూడడానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మైసూరుకు చేరుతారు. ఇదీ మొత్తంగా దసరా పండుగ వెనుక ఉన్న అంతరార్ధం.
ఇదీ చదవండి: దసరా వేళ.. జమ్మి జాడేది.. పాలపిట్ట కనపడదేంటి..!