Site icon Prime9

Revanth Reddy: రేవంత్ రెడ్డి అరెస్ట్.. జూబ్లిహిల్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం

revanth reddy arrest

revanth reddy arrest

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనితో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

సర్పంచ్‌ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, నిధులు విడుదల చేసి గ్రామీణాభివృద్ధికి తోడ్పాడాలని ధర్నా చౌక్ వద్ద సర్పంచులకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు ధర్నా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నిరసన చేపట్టేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని ఇంటి బయటే పోలీసులు అడ్డుకున్నారు. దానితో ఆగ్రహించిన ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంటికి వచ్చి బయటకు వస్తే అరెస్ట్ చేస్తానంటే ఎలా? అని రేవంత్ ప్రశ్నించారు. మీకు అభ్యంతరం ఉంటే ధర్నాచౌక్ దగ్గర అరెస్ట్ చేయండి అని పోలీసులకు సూచించారు.

తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని, తన ఇంటికొచ్చిన విజయారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విజయారెడ్డిని వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. దానితో ఆ ప్రాంతమంతా ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రగతిభవన్, గాంధీభవన్ వద్ద ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగేందుకు యత్నించారు. దానితో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సర్పంచ్‌ల ధర్నాకు మద్దతుగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సర్పంచ్‌ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, నిధులు విడుదల చేసి గ్రామీణాభివృద్ధికి తోడ్పాడాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నేతల ధర్నాను అడ్డుకోవడం సరికాదని అరెస్ట్‌లను ఆయన ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌ల ధర్నాకు అనుమతి నిరాకరణ, హౌస్ అరెస్ట్‌లు ప్రజాస్వామ్య వ్యతిరేకమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

Exit mobile version