Site icon Prime9

Telugu Desam Party : వైభవంగా తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. హైదరాబాద్ లో భారీ సభ

telugu desam party celebrating 41 years of foundation day

telugu desam party celebrating 41 years of foundation day

Telugu Desam Party : తెలుగు వారి ఆత్మ  నిలబెట్టడమే లక్ష్యంగా నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ “తెలుగుదేశం”.  1982 మార్చి 29న పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చారు. ఆత్మగౌరవంతో.. ఢిల్లీ లోనూ రాజకీయాలు చేశారు ఎన్టీఆర్. ప్రధాన ప్రతి పక్షంగా వ్యవహరించిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. ఆ తర్వాత ఓటమిని ఎదుర్కొని మళ్ళీ గెలిచి.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకి వచ్చి ప్రజల కోసం నిలబడుతూనే ఉంటుంది. కాగా నేడు పార్టీ  ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా..  ఆత్మగౌరవ నినాదంతో పుట్టి, తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్ అని అన్నారు. అలానే తెలుగుదేశం పార్టీ కూడా ట్విట్టర్ ద్వారా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది. ‘ప్రతీ అడుగూ ప్రజల కోసం.. ఈ 41 సంవత్సరాల ప్రస్థానం.. ప్రగతి కోసం మన తెలుగుదేశం.. ఇది తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు ప్రజలందరికీ టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు.. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, పార్టీ కోసం ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తల, నాయకుల కుటుంబాలకు పాదాభివందనాలు.. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు.. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్’ అని ట్వీట్ చేసింది.

 

కాగా ఈ మేరకు ఏపీతో తెలంగాణలో మళ్ళీ పార్టీని యాక్టివ్ చేయడానికి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈరోజు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అండమాన్ నుంచి కూడా పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారని సమాచారం అందుతుంది. మొత్తం 15 వేల మంది హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. ముఖ్యంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 10గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ జెండాను ఎగురవేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం 4గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే టీడీపీ ఆవిర్భావ సభలో చంద్రబాబు పాల్గొంటారు. టీడీపీ ఆవిర్భావ సభ సందర్భంగా హైదరాబాద్‌లోని కూడళ్లు పసుపు మయంగా మారాయి. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల పట్ల ఏం మాట్లాడతారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version