Gannavaram Issue : నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలి.. లేకుంటే డీజీపీ ఇంటిముందు దీక్ష : టీడీపీ నేత పట్టాభి భార్య

కృష్టా జిల్లా గన్నవరంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సోమవారం నుంచి గన్నవరంలో  టీడీపీ, వైసీపీ మధ్య  మాటల యుద్ధం సాగుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై  గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ  విమర్శలకు  స్థానిక టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 21, 2023 / 02:06 PM IST

Gannavaram Issue : కృష్టా జిల్లా గన్నవరంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సోమవారం నుంచి గన్నవరంలో  టీడీపీ, వైసీపీ మధ్య  మాటల యుద్ధం సాగుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై  గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ  విమర్శలకు  స్థానిక టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు. దీంతో  తమ నేతలను వంశీ బెదిరిస్తున్నారని  టీడీపీ ఆరోపిస్తుంది. ఈ విషయమై  నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకంది. ర్యాలీగా  పోలీస్ స్టేషన్ కు వెళ్లే సమయంలో  ఎమ్మెల్యే  వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు  వారిని అడ్డకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య  ఘర్షణ చోటు  చేసుకుంది.  టీడీపీ కార్యాలయంపై  వంశీ వర్గీయులు  దాడికి దిగారు.  పార్టీ కార్యాలయంలో  ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.  పార్టీ కార్యాలయ ఆవరణలో పార్క్  చేసిన కారుకు నిప్పంటించారు.దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

తెదేపా నేతల అరెస్టులు..

కాగా గన్నవరం టీడీపీ ఆఫీస్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. టీడీపీ కీలక నేతలు గన్నవరం రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. గన్నవరం బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుద్దా వెంకన్నకి, వంశీకి మధ్య మాటల యుద్దం నడుస్తుంది. దమ్ముంటే ఎన్టీఆర్ సెంటర్ కి రావాలని సవాలు విసురుకుంటున్నారు.

నా భర్తకి ఏదైనా జరిగితే సీఎం, డీజీపీదే బాధ్యత : తెదేపా నేత పట్టాభి భార్య

కాగా నిన్న రాత్రి దాడి విషయం తెలిసి గన్నవరం వెళ్లిన టీడీపీ నేత పట్టాభి రామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో పట్టాభి కనిపించకపోవడంపై ఆయన భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలిసి నా భర్త గన్నవరం కార్యాలయానికి వెళ్లారు. అక్కడికెళ్లాక ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆయన వివరాలు నాకు వెంటనే చెప్పకపోతే నేను డిజీపీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసేందుకు నిర్ణయించుకున్నాను. నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఆయనకు ఏం జరిగినా సీఎం, డిజీపీదే బాధ్యత’’ అని ఆమె తేల్చి చెప్పారు.

భర్త ఆఛూకీ కోసం ఆందోళన చేపడుతున్న చందనకు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫోన్ చేసి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏపీ నూతన గవర్నర్ నజీర్ ను కలిసి పరిస్థితిని వివరిస్తానని.. అధైర్యపడొద్దని రఘురామ భరోసా ఇచ్చారు.

కాగా మరోవైపు టీడీపీ నేత పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే గన్నవరంలో శాంతి భద్రతల సమస్యకు విఘాతం వాటిల్లిందని ఎస్పీ జాషువా చెప్పారు. మంగళవారం నాడు ఎస్పీ జాషువా మీడియాతో మాట్లాడారు. టీడీపీ నిర్వహించిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదన్నారు. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ల దాడిలో గన్నవరం సీఐ తలకి గాయమైందని ఎస్పీ వివరించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఘటనలపై సుమోటోగా తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

అయితే గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వసం చేయడమే కాకుండా అక్కడ ఉన్న ఐదు వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనలు గన్నవరంలో బీభత్సం సృష్టించాయి. అయితే వంశీ ప్రోద్బలంతోనే తమ కార్యాలయంపై దాడులతో అద్దాలను, ఫర్నీచర్ ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ నిలిపి ఉంచిన వాహనాలను తగులబెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/