Site icon Prime9

Munugode By Poll: అన్ని దారులూ ’మునుగోడు‘ వైపే

Munugodu elections nominations ends today

Munugodu elections nominations ends today

Munugode: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ హడావుడి పెరిగింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీంతో అన్ని పార్టీలు గెలుపు కోసం తమ కార్యచరణను ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా మునుగోడు సిట్టింగ్ స్థానంగా ఉన్న కాంగ్రెస్, ప్రధాన పార్టీలైన బిజెపి, టిఆర్ఎస్ లు ఉప ఎన్నికకు అస్త్రశస్త్రాలని సిద్ధం చేసుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు పోటీ చేయనున్నాయి. కానీ ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ల మధ్య ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముందస్తు ఒప్పందంతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి ఆపార్టీ నుంచి బరిలో ఉంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి స్వర్గీయ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కూతురు స్రవంతికి టికెట్‌ లభించింది. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే టీఆర్‌ఎస్‌ టికెట్‌ లభించింది. మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజికవర్గం నాయకులకే టికెట్లు ఇచ్చాయి. అయితే మునుగోడు నియోజకవర్గంలో బిసి ఓటర్లు అధికంగా ఉన్నారు. కానీ ప్రధాన పార్టీలు బీసీ అభ్యర్థులకు టికెట్ కేటాయించలేదు. దీంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకతో బిజెపిలోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే బిజెపిలో చేరుతుండడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలోని స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు అందరిని దాదాపుగా బీజేపీలోకి లాగేసుకుంటున్నారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం సైతం మునుగోడు స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది.

మరోవైపు టిఆర్ఎస్ సైతం కాంగ్రెస్ శ్రేణులపైనే దృష్టి పెట్టింది. ఓవైపు బిజెపి, మరోవైపు టిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ శ్రేణుల్ని అత్యధికంగా లాక్కునెందుకు ఆసక్తి చూపడం వల్ల రోజూరోజుకి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీనియర్‌ నేతలు మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా, వలసలను మాత్రం ఆపలేకపోతున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా మునుగోడు స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఉద్దేశంతో ఉంది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్సే గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌ ఆధిక్యానికి గండిపడింది. అయితే తిరిగి మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ జండా ఎగురవేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం రోజురోజుకీ ఎక్కువవుతోంది. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో దాదాపుగా వర్గపోరు కనిపిస్తోంది. నారాయణపురం, చండూరు, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్ మండలాల్లో మూడు, నాలుగు వర్గాలుగా టిఆర్ఎస్ పార్టీ చీలిపోయింది. ఒక్క టిఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్యే అభ్యర్థులు ఆరుగురు ఉన్నారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు బీసీ వాదం మునుగోడు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తుండడం వల్ల ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉండనుదనే భయం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

Exit mobile version