Site icon Prime9

PayCM posters: బెంగళూరులో PayCM పోస్టర్లు

BANGALORE

BANGALORE

Bangalore: కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలతో కాంగ్రెస్ బుధవారం ఉదయం బెంగళూరు అంతటా ‘PayCM’ పోస్టర్‌లను ఏర్పాటు చేసింది. పోస్టర్లలో ముఖ్యమంత్రి చిత్రంతో పాటు QR కోడ్ ఉంటుంది. అది ప్రజలను www.40percentsarkara.com కి తీసుకువెడుతుంది. ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్ పార్టీ తన ‘40% ప్రభుత్వం, బీజేపీ అంటే అవినీతి’ ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 13న ప్రారంభించింది.

ప్రస్తుత పాలనలో 40% కమీషన్ రేటు ఆనవాయితీగా మారిందన్న ఆరోపణను హైలైట్ చేయడానికి, ఇది టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్- 8447704040 ని కూడా ప్రారంభించింది. ఈ పోస్టర్ల పై బీజేపీ అధికార ప్రతినిధి ఎస్ ప్రకాష్ మాట్లాడుతూ ఇది ఎన్నికల నేపథ్యంలో సాగుతున్న ప్రచారమని, ప్రభుత్వం పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారని అటువంటి ఈ పార్టీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరమని అన్నారు.

‘హిందూ వాహిని’ అనే సంస్థ జాతీయ కార్యదర్శిగా ఉన్న సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కర్ణాటక ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు మరింత పెరిగాయి. సిట్టింగ్ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తాను చేసిన పబ్లిక్ వర్క్‌లో 40% కమీషన్ డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు పాటిల్‌ ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు లేఖ కూడా రాసినట్లు సమాచారం. అయితే, కర్ణాటక మంత్రి పాటిల్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈశ్వరప్ప ఏప్రిల్ 15న తన పదవికి రాజీనామా చేసారు.

Exit mobile version