Site icon Prime9

Pawan Kalyan: సీఎం సీట్లో జనసేనాని

pawan-kalyan-janasena

pawan-kalyan-janasena

Andhra Pradesh: ఎలాగైనా ఆంధ్రప్రదేశ్‌ సీఎం సీటులో కూర్చోవాల్సిందే. ఇది పవన్ కల్యాణ్‌ పట్టుదల. ఆయన ఆ దిశగానే క్యాడర్‌కి క్లారిటీ ఇచ్చేశారు. ఏపీలో కచ్చితంగా జనసేన జెండా ఎగరాల్సిందే అంటూ పవన్ మంగళగిరిలో జరిగిన సమావేశంలో జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. దాంతో జనసేన క్యాడర్‌ నుంచి అనూహ్యమైన ప్రతిస్పందన వచ్చింది. ముందుగా తన మీద ప్యాకేజ్ స్టార్ ముద్రను తొలగించుకునే క్రమంలో పవన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. అంతే కాదు ఏకంగా స్టేజ్ మీదనే, నా కొడకా చెప్పు తీసుకుని కొడతా అని విరుచుకుపడ్డారు. దీని ద్వారా పవన్ అటు వైసీపీకి హెచ్చరికలు జారీ చేస్తూనే ఇటు తాను ఏ పార్టీకి అనుకూలం కాదని స్పష్టం చేశారు. ఇక పవన్ మరో మాట కూడా చెప్పారు. ఏ పార్టీకి అయినా ఓట్లు ఉంటాయి. కానీ వాటిని బూతులలో వేసుకుంటేనే లెక్క విలువ ఉంటుంది. అపుడే అధికారం దక్కుతుంది. అందువల్ల పవన్ బూత్ లెవెల్ లో తన పార్టీకి నిలబడే వారు కావాలని కార్యకర్తలను కోరారు.

అలాగే నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అంటూ ఆయన అణగారిన కులాలను సొంతం చేసుకుంటూ చేసిన ప్రసంగంలో కూడా సామాజిక కోణం సోషల్ ఇంజనీరింగ్ కోసం వేసే కొత్త ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. అదే విధంగా తన పార్టీలో అన్ని కులాలు ఉన్నాయని పవన్ చెప్పుకున్నారు. ఏపీలో అతి పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు బలిజలకు ఇప్పటిదాకా అధికారం దక్కకపోవడం బాధాకరమని అన్నారు. దీని బట్టి పవన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ ఏంటి అన్నది అర్ధమవుతోంది.అంటే కాపుల నాయకత్వంలో మిగిలిన బడుగు, బలహీన వర్గాలు అన్నీ ఒక గొడుగు కిందకు రావడం ద్వారా ఏపీలో అధికారంలోకి రావాలని పవన్ బలంగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తానికి పవన్ మార్క్ రాజకీయానికి పదును పెట్టారట. ఆయన అడుగులు తన అధికార వాటా సీఎం సీటు తేల్చుకునే దిశగా కార్యచరణను సిద్ధం చేస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇవన్నీ పరిశీలిస్తే, పవన్ కచ్చితంగా సీఎం సీటునే టార్గెట్ చేశారు.

మంగళవారం విజయవాడ నోవాటెల్‌ హోటల్‌లో కీలక భేటీ జరిగింది. పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. విశాఖ ఎపిసోడ్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవన్‌ను పరామర్శించడానికి వచ్చాను అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌ పాలన పై ఇద్దరు నేతలు నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవడానికి కలిసి పనిచేస్తామన్నారు. అయితే, పవన్‌, చంద్రబాబు భేటీలో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి శత్రువును జగన్‌ను ఈసారి ఎలాగైనా ఓడించాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు ఆయా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో పొత్తులు, సీట్ల ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. ఎలాగైనా సీఎం సీటు దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న పవన్‌ కల్యాణ్‌, ఫిఫ్టీ, ఫిఫ్టీ పవర్‌ షేరింగ్‌ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అంటే మొదటి రెండున్నర సంవత్సరాలు పవన్‌ కల్యాణ్‌ సీఎం, ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు సీఎం అని. ఇలా చేస్తే ఎలా ఉంటుందన్నదానిపై ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఉమ్మడి ప్రెస్‌మీట్‌లో పవన్‌, చంద్రబాబు ఏం మాట్లాడలేదు. మొదట ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆ తర్వాతే మిగతా సంగతి అంటూ దాట వేశారు.

పవన్‌ ప్రతిపాదించిన ఫిఫ్టీ, ఫిఫ్టీ పవర్‌ షేరింగ్‌కు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎందుకంటే, తాను సీఎం కాకున్నా పర్వాలేదు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదు అన్నది చంద్రబాబు ముఖ్య లక్ష్యం. అందుకోసం కొన్ని త్యాగాలకు సిద్ధపడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌ మళ్లీ సీఎం అయితే, టీడీపీకి భవిష్యత్‌లో కష్టాలు తప్పవని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. అందుకే పవన్‌ ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌ సమావేశాల్లో పవన్‌, చంద్రబాబు దీనిపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది.

Exit mobile version
Skip to toolbar