Pawan Kalyan: బలమైన పోరాటాలు చేయగల సమర్థులు, అనుకున్నది సాధించే పట్టుదల ఉన్న వ్యక్తి, రాజనీతిజ్ఞత కలిగిన నాయకుడు హరిరామ జోగయ్య అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ) రిజర్వేషన్లు కాపులకు వర్తింపచేయాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన హరిరామ జోగయ్యను పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సోమవారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లో హరిరామ జోగయ్యను పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం నిరాకరిస్తూ దీక్షను కొనసాగిస్తున్న ఆయన్ని, వయసురీత్యా వెంటనే దీక్షను విరమించాలని, మందులు వేసుకోవాలని కోరారు. ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యయుతంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వంపై పోరాడుదామని చెప్పారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హరిరామ జోగయ్య అనుకున్నది సాధించే వ్యక్తి అని పేర్కొన్నారు. “2008లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హరిరామ జోగయ్య కుటుంబం మీద దాడి చేయించిందని తెలిపారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించారనే కారణంతో జోగయ్య సతీమణి ఇంట్లో ఉన్న సమయంలోనే దాడి చేయించారని ఆయన చెప్పారు. అవన్నీ తట్టుకొని నిలబడిన గొప్ప పోరాట యోధుడు ఆయనంటూ పవన్ అన్నారు. హరిరామ జోగయ్యతో నాకున్న అనుబంధం చాలా విలువైందని తెలిపారు.
పదవులపై ఎలాంటి ఆపేక్ష లేకుండా, నిస్వార్థంగా రాజకీయాలు చేయగల సమర్థత ఆయన సొంతమని.. ఆయన విలువైన సూచనలు, సలహాలు మాకు ఎంతో అవసరం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కచ్చితంగా అలుపెరుగని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 85ఏళ్ల వయస్సులో పేదప్రజల కోసం దీక్షచేపట్టిన హరిరామ జోగయ్య స్పూర్తి సదా అనుసరణీయమని ఆయన పేర్కొన్నారు.