Munugode: తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక అంటేనే ఓటుకు భారీ డిమాండ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అన్ని రాజకీయ పార్టీలకు ప్రతి ఓటు కీలకమే కావడంతో కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ మునుగోడు నియోజకవర్గంలో ఊపందుకుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా కొత్త ఓట్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో మీసేవ కేంద్రాల్లో కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తుదారులు వస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేసే అస్త్రాలను రాజకీయ పక్షాలు పోటాపోటీగా వినియోగిస్తుండడంతో ఓటుకు డిమాండ్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత నెల 2న రాజీనామా చేసిన నాటి నుండి ఇప్పటి వరకు 15 వేలకు పైగా ఓటరు నమోదుకు దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్‌లో దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు
మునుగోడు నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు అయినటువంటి టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి గెలుపే లక్ష్యంగా ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేసేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో పార్టీ నుంచి ఓటుకు పదివేల చొప్పున పంచే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కో ఓటు విలువ 30 వేల రూపాయలకు తగ్గదని నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం విడిచి ఇతర ప్రదేశాలకు వెళ్లి స్థిర పడ్డవారు కూడా మళ్లీ ఇక్కడికి వచ్చి ఓటును నమోదు చేసుకుంటున్నారు.
స్థానికంగా ఓటు ఉంటే ఉప ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం ఏవైనా కొత్త పథకాలు ప్రవేశ పెడితే తమకు వస్తాయని ఆశతో కూడా ఓటు నమోదుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో కొత్త ఓటు కోసం దరఖాస్తులు దాదాపుగా 15 వేలకు చేరాయి. రాబోయి రోజుల్లో దరఖాస్తులు మరిన్ని వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చౌటుప్పల్ మండలం నుండి అత్యధికంగా, నాంపల్లి మండలం నుంచి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి.