Site icon Prime9

Viveka Murder Case : వివేకానంద రెడ్డి హత్య కేసులో.. మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి

mp avinash reddy second time attending for enquiry about viveka murder case

mp avinash reddy second time attending for enquiry about viveka murder case

Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణలో భాగంగా ఈరోజు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి మరోసారి సీబీఐ ముందు హాజరు కానున్నారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులివ్వగా..  అవినాష్‌రెడ్డి 3 గంటలకు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయం ముందు హాజరు కానున్నారు. ఈ కేసు తెలంగాణకు బదీలీ అయ్యాక అవినాష్‌ రెడ్డిని రెండోసారి సీబీఐ ప్రశ్నించనుంది. ఈ కేసులో అవినాష్‌ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని భావిస్తున్న సీబీఐ ఆయన్ను సుధీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏ2 సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ కౌంటర్‌పై సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. హత్య జరిగిన రోజు నిందితులంతా భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గుర్తించామని కౌంటర్‌లో పేర్కొంది. అంతే కాకుండా ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని సీబీఐ వెల్లడించింది.

రెండో సారి విచారణకు ఎంపీ అవినాష్ (Viveka Murder Case)..

హత్య కుట్ర మొత్తం అవినాష్‌రెడ్డికి ముందే తెలుసని.. ఘటనా స్థలంలో సాక్ష్యాలను, ఆధారాలను చెరిపివేయడంలో అవినాష్‌ పాత్ర ఉందని సీబీఐ అనుమానిస్తుంది. అవినాష్‌ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి కూడా ఇందులో ప్రమేయం ఉందని భావిస్తున్నారు. విచారణ ముగిసిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వివేక హాత్య చేయించింది అవినాష్‌రెడ్డే అని భావిస్తున్న సీబీఐ 40 కోట్ల డీల్‌పై ఆయన్ను ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలున్నాయి. ఇవాళ విచారణ తర్వాత సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇవాళ జరిగే విచారణ కోసం అవినాష్‌రెడ్డి ఇప్పటికే పులివెందుల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

గత నెల 28న అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించారు. అప్పట్లో విచారణలో కాల్‌డేటాపై దృష్టి సారించారు. తర్వాత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌లను కడపకు పిలిపించి విచారించారు. ఇదే కేసులో నిందితుడైన సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌లో సీబీఐ కౌంటర్ దాఖలు చేస్తూ వివేకా హత్యకు పన్నిన కుట్ర గురించి సమగ్రంగా వివరించింది. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్‌ రెడ్డిని విచారించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌లో ఎంపీతో పాటు ఆయన తండ్రి పాత్రను ప్రస్తావించింది. ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని నిన్నే విచారణకు హాజరు కావాలని నోటీసులివ్వగా.. ఆయన హాజరు కాలేదు. తనకు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న కారణంగా రాలేనని సమాధానం ఇచ్చారు. పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడులోని ఓ క్షేత్రానికి యాత్రకు వెళ్లినట్లు సమాచారం.

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదు – సజ్జల

కాగా మరోవైపు వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినాష్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా మా నాయకుడిని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్నారు. బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు.

‘‘వివేకాను కోల్పోవడం వైఎస్సార్‌సీపీకి, జగన్‌కు నష్టమే. వివేకా తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది జగనే. వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు. కొందరిని టార్గెట్‌ చేస్తూ విచారణ చేస్తున్నారు. వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్‌ చేస్తేనే అవినాష్‌రెడ్డి వెళ్లారు. శివప్రకాష్‌రెడ్డి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయారని తనకు చెప్పినట్లు ఆదినారాయణరెడ్డే చెప్పాడు. వివేకా ఫోన్‌లోని రికార్డులను ఎందుకు డిలీట్‌ చేశారు?’’ అని సజ్జల ప్రశ్నించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version