Site icon Prime9

Pawan Kalyan: బస్సెక్కే ముందే భారీ వ్యూహాలు.. చేరికలపై జనసేనాని నజర్

janasena-bus-yatra

Amaravati: దసరా నుంచి ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ – బస్సు యాత్ర పండుగ సందర్భంగా మొదలుకానుంది. ఆర్నెళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌ను చుట్టివచ్చేలా జనసేన భారీ ప్లాన్‌ చేసింది. యాత్రకు అపూర్వ ఆదరణ లభించాలంటే ఏం చేయాలన్నదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పవన్‌ బస్సెక్కే ముందే పవన్ భారీ వ్యూహాలు సిద్ధమవుతున్నాయట.

జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయానికి ఇపుడు పదును పెడుతున్నారు. ఇక రానున్న ఏడాదిన్నర కాలంలో ఏపీ అంతా టూర్ చేయడం ద్వారా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకోవాలనుకుంటున్నారు. ఇక తాను బస్సు యాత్ర చేపట్టే జిల్లాలలో చేరికలు గట్టిగా ఉండాలని భారీ స్కెచ్ కి పవన్ రెడీ అయ్యారట. బస్సు యాత్ర అంటే మామూలుగా సాగదు. దానికి ఎంతో వ్యయ ప్రయాసలు ఉంటాయి. అలాగే అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా సాగాలీ అంటే లోకల్ గా గట్టి నేతలు ఉండాలి. అందుకే పవన్ చూపు ఇపుడు ఇతర పార్టీల మీద పడిందని సమాచారం.ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారని తెలిసింది. ఇతర పార్టీల నాయకులు ఆయనను కలుస్తున్నారట. అలాగే కీలకమైన నాయకులు, జిల్లాల్లో పట్టున్న వారు, రాజకీయాలను శాసించేవారు అంతా కూడా పవన్ వైపు రావాలని చూస్తున్నారు. ఆయన సైతం ఇపుడు వారి అవసరం బాగా ఉంటుందని గుర్తెరిగి చేరదీయడానికి ఓకే చెప్పారని టాక్‌.

ఉత్తరాంధ్రా జిల్లాలలో గట్టి నేతలు చాలా మంది జనసేనలో చేరికకు రెడీ అవుతున్నారు. వారంతా తమ ఇలాకాలలో స్ట్రాంగ్ లీడర్స్. ఇక వైసీపీలో చూస్తే చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు జనసేనలో చేరాలని భావిస్తున్నారని తెలిసింది. ఎమ్మెల్యే తరువాత తామే అంటూ చక్రం తిప్పే వారు ఇపుడు జనసేనలో తమ లక్‌ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అలాగే ఒకనాడు మంత్రి పదవులు నిర్వహించి, ఇపుడు ఖాళీ అయిన వారు కూడా ఉన్న పార్టీలో ఉక్కబోతతో జనసేన తీర్ధం పుచ్చుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారని సమాచారం. ఈ విధంగా చూస్తే ఉత్తరాంధ్రాలో లిస్ట్ చాలా పెద్దదే కనిపిస్తోంది. అలాగే గోదావరి జిల్లాలో కూడా జనసేనలోకి టీడీపీ, వైసీపీ నుంచి చేరికలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనతో పొత్తు వల్ల తమకు సీటు రాదని టీడీపీలో భావిస్తున్న వారు కూడా పవన్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అలాగే వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వారు, సామాజిక సమీకరణలవల్ల ఈసారి గెలవలేమని భావిస్తున్న వారు కూడా జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు.

ఇలా ఉత్తరాంధ్రాతో మొదలుపెడితే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో జనసేనలో భారీ చేరికలు ఉండవచ్చు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బస్సెక్కి ఏపీ అంతా టూర్ చేయనున్న పవన్ కి కూడా ఈ చేరికలు ఇపుడు చాలా అవసరమని వారు చెబుతున్నారు. తమ పార్టీలో జనాలలో ఆదరణ ఉందని చెప్పుకోవడానికి ఆయన ఫస్ట్ టైం జనసేన గేట్లు ఎత్తేయబోతున్నారు అని అంటున్నారు. దాంతో ఒక పద్ధతి ప్రకారం జనసేన గ్రాఫ్ పెంచేలా ఈ చేరికలు ఉంటాయని భావిస్తున్నారు. పవన్ బస్సు యాత్ర ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో భారీ ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దాంతో జనాల్లో జనసేన మీద పొలిటికల్ గా భారీ ఇంపాక్ట్ పడుతుంది అని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల మీద ఇప్పటికైతే టీడీపీతో జనసేన సాగుతుంది అని చెబుతున్నా సీట్ల పంచాయతీ తేలాలి. దాంతో తమకు బలముంది అని చెప్పుకోవాలంటే ఇతర పార్టీల నుంచి చేరికలను ఆహ్వానించక తప్పదని జనసేన భావిస్తోంది అని సమాచారం.

ఈ నేపధ్యంలోనే చాలా మంది పెద్ద నేతలను కూడా జనసేనవైపుగా రప్పిస్తున్నారు అని అంటున్నారు. ఆయా నాయకులు చేరితే వారితో పాటే సీట్లూ కూడా వస్తాయన్నదే జనసేన లెక్క అట. అంటే రేపటి రోజున పొత్తులు కుదిరినా గౌరవప్రదంగా సీట్లు దక్కేలా జాగ్రత్తపడుతున్నారన్నమాట. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలకు ఇపుడు జనసేన గురి పెట్టింది. దాంతో ఆ పార్టీలకు ఇక చుక్కలే అని పొలిటికల్‌ సర్కిల్స్‌లో టాక్‌ నడుస్తోంది.

Exit mobile version
Skip to toolbar