Jana Sena: అత్తగారు తిట్టినందుకు కాదు. తోటికోడలు నవ్వినందుకు కుమిలిపోయిందట ఒక కోడలు. వైసీపీ నేతల పరిస్దితి అలానే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కలిసి తమ అధికార దర్పాన్ని ఉపయోగించి, చూపించిన విశాఖ గర్జన అట్టర్ ప్లాప్ గా నిలిచింది. మరోవైపు తమ అధినేత పవన్ కళ్యాణ్ ను చూడటానికి జనసైనికులు పోటెత్తారు. బిర్యానీ పాకెట్లు, డబ్బులు, బలప్రయోగాలు ఏమీ లేవు. ఉన్నదంతా గుండెల నిండా అభిమానమే. దీనిని తట్టుకోలేక పోయిన ప్రభుత్వ పెద్దలు విద్యుత్ సరఫరా నిలిపివేసారు. జనసైనికులను అర్దరాత్రి అరెస్టులు చేసారు. పవన్ కళ్యాణ్ ను ఆంక్షల పేరిట హోటల్ నుంచి బయటకు రానీయలేదు. అయినా సరే పక్కన ఉన్న సమద్రం ఘోషతో పోటీ పడుతూ జనసైనికులు తమ నాయకుడికి మద్దతుగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. విశాఖ పట్నంలో గత మూడురోజుల ఎపిసోడ్ లో టోటల్ గా అర్దమయిన విషయం ఒక్కటే. జనసేనానికి ఉన్న ప్రజాబలం, ఆకర్షణ తిరుగులేనివి. దీనితో సీఎం జగన్ కు ముఖం ఎలా చూపించాలా అని వైసీపీ నేతలు మధనపడుతున్నట్లు సమాచారం.
శనివారం విశాఖ ఎయిర్ పోర్టులో జన సైనికులు వైసీపీ మంత్రుల కాన్వాయ్ మీద దాడులు చేశారు అన్న వార్తలతో మీడియా ఫోకస్ అంతా అటు మళ్ళిపోయింది. దానికి తోడు అన్నట్లుగా జనసైనికుల అరెస్టులు జరగడంతో టాక్ ఆఫ్ ది ఏపీ అన్నట్లుగా ఆ మ్యాటరే మారుమోగింది. ఇక టీవీ డిబేట్ల నుంచి అన్నీ కూడా దాని మీదనే వాడి వేడిగా చర్చించాయి. విశాఖలో పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టకపోయినా హొటెల్ గదిలో ఉన్నా కూడా ఆయనే విశాఖ సెంటర్ అట్రాక్షన్ అయిపోయారు. అదే విధంగా పవన్ని అరెస్ట్ చేస్తారన్న వార్తలు కూడ చర్చకు వచ్చాయి. ఒక రకంగా విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన వైసీపీ నేతలకు వార్నింగ్ లాంటిదే. ఇంతవరకూ తాము ప్రతిపక్షనేతల పై ఎటువంటి వ్యాఖ్యలయినా చేయవచ్చని తమకు తిరుగులేదనుకున్న నేతలు ఇకపై క్షేత్ర స్దాయిలో తిరిగే టపుడు జాగ్రత్తగా ఉండవలసిందే. పవన్ విశాఖలో నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమం వేదిక ముందు వైసీపీ వారు ఆందోళన చేయడంతో ఇష్యూ మొత్తం పవన్ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. జనవాణి రద్దయినా, పవన్ ప్రజల్లోకి వెళ్లకపోయినా జనసేన పార్టీకి మంచి మైలేజీ వచ్చింది. విద్యావంతులు, నిరక్షరాస్యులు, తటస్దంగా ఉండే వారు కూడ విశాఖలో పోలీసులను ఉపయోగించి జనసేనానిని కట్టడి చేయడాన్ని తప్పు పడుతున్నారు.
వైసీపీకి ఈ టోటల్ ఎపిసోడ్ లో అక్రమ అరెస్టులు చేశారన్న చెడ్డ పేరుతో పాటు పవన్ కు సరైన కౌంటర్ ఇవ్వలేక చతికిలపడింది. ఇదంతా సరైన ప్లానింగ్, వ్యూహాలు లేని కారణంగా, వైసీపీ నేతలు దూకుడు వల్లనే అని అంటున్నారు. మంత్రుల దాడి ఘటన మీద పూర్తిగా విచారించి అసలైన బాధ్యుల మీద కేసులు పెడితే సరిపోయేది. అలా కాకుండా జనసేన అన్న ప్రతీ నాయకుడి మీద కేసులు పెట్టి పోలీసులు అత్యుత్సాహం చూపించారు అని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ ను నియంత్రించడం కూడ సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంది. దానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం వరకే అధికార యంత్రాంగం పరిమితమవ్వాలి. అంతేకాని విపక్షనేతలను అరెస్ట్ చేయాలనుకోవడం నియంతస్వభావమే అనిపించుకుంటుంది. పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్నలకు, చేస్తున్న విమర్శలకు బదులివ్వలేక ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇవన్నీ వైసీపీ మద్దతుదారులకు కూడ నచ్చలేదు. ఒకరకంగా వైజాగ్ లో అతిచేసి పవన్ కు మైలేజీ ఇచ్చేసారని వారంటున్నారు. ఏదైమైనా వైజాగ్ ఎపిసోడ్ వైసీపీనేతలకు గుణపాఠమే అని చెప్పవచ్చు.
వైసీపీ నేతలు తరచుగా పవన్ కళ్యాన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. మరి అటువంటపుడు పవన్ కు ఎందుకు భయపడుతున్నారు? పవన్ కు ఉన్న ప్రజాకర్షణ, మద్దతు, సవాళ్లకు తలవంచని వైనం, తెగింపు ఇవన్నీ వారికి తెలుసు. అందుకే మోతాదు మించి విమర్శలు చేస్తున్నారా? పబ్లిగ్గా కాకపోయినా తమ ప్రైవేటు సంబాషణల్లోనయినా వారు పవన్ కెపాసిటీ గురించి చెప్పుకోవడం ఖాయం. డబ్బులు, బల ప్రయోగాలు, బెదిరింపులు జనాన్ని తరలించడానికి కొంతమేర ఉపయోగపడతాయి. కాని వారి మనసులను మార్చలేవు. వారి చేత బలవంతంగా ఓట్లు వేయించలేవు. వైసీపీ అధినాయకత్వం దీనిని గుర్తించడం మంచిది.