Harirama Jogaiah: కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యతో తాజాగా పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. పవన్ సూచనతో ఆయన దీక్షను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విరమించారు. కాపులకు ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై వారంలో హైకోర్టుకు వెళ్తానని వెల్లడించారు. ఇక తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమని పేర్కొంటూ వెంటనే వారిని విడుదల చేయాలని ఆయన కోరారు.
అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లను కాపులకు ఐదు శాతం కేటాయించాలని కాపు ఉద్యమ నేత జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై డిసెంబర్ 30 తేదీ వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి జోగయ్య సమయం ఇచ్చారు. కాగా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో జోగయ్య నిన్న రాత్రి నుంచి ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నట్టు ప్రకటించారు. దీక్ష ఆలోచన విరమించుకోవాలని పోలీసులు ఆయనకు సూచించారు. పాలకొల్లులోని తన ఇంటి వద్ద జోగయ్య ను అదుపులోకి తీసుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దీనితో ఏలూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరిరామజోగయ్యకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని వైద్యం అందించేందుకు డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన నిరాకరిస్తున్నారని సమాచారం అందడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. 85 ఏళ్ల వయస్సులో ఆయన దీక్ష చేపట్టడంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే జోగయ్యను ఫోన్ చేసి మాట్లాడారు. ఈ వయస్సులో అంత మొండి పట్టు పట్టడం పట్ల పవన్ బాధపడ్డారు. ప్రజల కోసం ఈ వయస్సులో కూడా అన్నం తినకుండా … ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయడాన్ని హరిరామ జోగయ్య గొప్పతనంగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. కనీసం టాబ్లెట్స్ అయిన వేసుకోవాలని.. వెంటనే ఆ దీక్షను విరమించాలని పవన్ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన జోగయ్య దీక్ష విరమిస్తున్నట్టు తెలిపారు.