Site icon Prime9

YCP Leaders: పనిలేదు.. పవర్ లేదు.. ఎందుకొచ్చిన పదవులు అంటున్న వైసీపీ నేతలు

YCP LEADERS

YCP LEADERS

Andhra Pradesh: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా మధనం జరుగుతోందట. అసలు ఏంటి మన పరిస్థితి అని కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కుర్చీలు ఎక్కిన మంత్రులు చాలా మంది అనుకుంటున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలకు మూడున్నరేళ్ల కాలంలో సుఖాల కంటే కష్టాలే దక్కాయని అంటున్నారు. అదేలా అంటే గెలిచిన తరువాత మొదటి ఆరు నెలలు ఎలా గడచిందో తెలియదు. కానీ రెండేళ్ల పాటు కరోనా వచ్చి గెలిచిన వారిని అందరికీ ఇంట్లో కూర్చోబెట్టేసింది.

ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలు అయిపోయారన్న టాక్‌ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. కనీసం ఒక చిన్నపాటి పని తమ ప్రాంతానికి చేయాలన్నా వారికి నిధులు లేవు. అధికారాలు లేవు అన్నట్లుగానే అంతా పరిస్థితి ఉందట. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ఎమ్మెల్యేలకు అసలు ఏ కోశానా పని లేకుండా పోయిందని తెలిసింది. పోనీ సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఈ వ్యవస్థను పెట్టిందనుకున్నా అభివృద్ధి విషయంలో అయినా ఎమ్మెల్యేలు చేసేందుకు ఏదీ లేకుండా పోయింది అంటున్నారు. రోడ్లు దారుణంగా పాడైపోయినా ఎమ్మెల్యేలను జనాలు నిగ్గదీస్తున్నా కూడా వారు ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉన్న పరిస్థితి. ఇలా అంతా సాగుతుండగానే ఇట్టే మూడేళ్ళ పుణ్య కాలం గడచిపోయింది.

దాంతో ఇపుడు గడప గడపకు అంటూ జనాల్లోకి వెళ్ళమని వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యేలను ఆదేశించింది. హైకమాండ్‌ హుకుం జారీ చేయడంతో గడప గడపకూ వెళ్తున్నారు. అయితే వర్క్ షాప్ పేరిట తరచూ మీటింగ్స్ పెట్టి మీ పనితీరు బాలేదు మీరు ఎక్కడికీ పోవడం లేదు అంటూ సీఎం జగన్‌ తమను తక్కువ చేయడంతోనే ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారుట. దీని వల్ల తాము ప్రజలతో పాటు పార్టీ నాయకుల వద్ద కూడా చిన్నబోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకో తమను అర్జంటుగా జనాల వద్దకు పంపించి, దానికి మార్కులేయడం తమ పనితీరు మీద తమకే డౌట్లు వచ్చేలా కామెంట్స్ చేయడం బట్టి చూస్తే తాము నెగ్గి ఎమ్మెల్యేలుగా ఏమి సాధించామని తీవ్రంగా మధనపడుతున్నారుట.

ఇక కొత్తగా పనిచేయని వారికి సీట్లు ఇవ్వమని చెబుతూంటే సొంత పార్టీలోనే తమ నేతలతోనే పోటీ పెట్టి ఈ రోజు నుంచే ఎవరూ తమ మాట వినకుండా ఉన్న విచిత్రమైన వాతావరణాన్ని సృషించారని ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. తమ పనితీరు కూడా బాలేదని ముద్ర వేస్తూంటే ఎందుకొచ్చిన రాజకీయమని వారే ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఒకనాడు ఇతర పార్టీలలో చూస్తే నియోజకవర్గానికి కింగ్ లా ఉండే ఎమ్మెల్యేలు వైసీపీ ఏలుబడిలో ఏమీ కాకుండా పోవడం రాజకీయ వైచిత్రే మరి. ఈ నేపథ్యంలో అసలు పనితీరు బాలేదంటూ రాజకీయంగానే కొరగాని వాళ్ళను చేస్తున్నారు అని వైసీపీలో అస్మదీయులు బాధపడితే దానికి అర్ధాలు వెతికి చూడాలిగా. మొత్తానికి వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వణికిపోతున్నారా అన్నదే ఇపుడు సీరియస్ మ్యాటర్‌గా మారిందట.

Exit mobile version