New Delhi: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి సీనియన్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే. శశిథరూర్‌లు మాత్రమే ఒకరితో ఒకరు తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త సిద్దాంతం వన్ పార్టీ, వన్ పోస్టు ప్రకారం ఒక వేళ మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా, రాహుల్‌ల మద్దతు ఖర్గేకే ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇక థరూర్ పోటీ నామమాత్రమేనని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
శశిథరూర్ ఈ రోజు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఖర్గే తన నామినేషన్ పేపర్లను మూడు గంటలకు సమర్పించారు. ఇప్పటి వరకు పోటీ చేస్తారనుకున్న దిగ్విజయ్‌సింగ్ ఈ రోజు ఖర్గేతో సమావేశమైన తర్వాత పోటీ నుంచి తప్పుకున్నారు. కాగా గురువారం రాత్రి కేసీ వేణుగోపాల్, ఖర్గేలు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఖర్గేను పోటీలో నిలిపాలని కోరారని వేణుగోపాల్ ఆయన చెప్పారు. కాగా గాంధీలు మాత్రం తాము న్యూట్రల్‌గా ఉంటామని చెబుతున్నా, తెర వెనుక మాత్రం తమకు అనుకూలంగా ఉన్న అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటున్నారు. మాజీ హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ హడా జీ-23 అసంతృప్తి వర్గం గ్రూపులో సభ్యుడు. 2020లో సోనియాగాంధీకి రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన కూడా ఖర్గేకు మద్దతు పలకడం విశేషం.
ఇదిలా ఉండగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిన్న సోనియాగాంధీని కలిశారు. రాజస్తాన్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం పట్ల ఆయన సోనియాను కలిసి క్షమాపణ కోరారు. వాస్తవానికి గాంధీల మొదటి చాయిస్ గెహ్లాటే. రాజస్తాన్ సీఎం పదవి సచిన్ పైలెట్‌కు ఇస్తారని గెహ్లాట్ ఆందోళన చెందుతున్నారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గెహ్లాట్ పై ఆగ్రహంగా ఉంది. తాను ముఖ్యమంత్రిగా కొనసాగలా వద్దా అనేది సోనియా చేతిలో ఉందని నిన్న గెహ్లాట్ అన్నారు. రాజస్తాన్ ఎమ్మెల్యేల్లో కొందరి పై వేటు పడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో కేరళ యాత్ర ముగించుకుని కర్నాటకకు చేరుకున్నారు.