Hyderabad: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు రెడీ అయ్యారు. అక్టోబర్ 15న బాసర సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం భైంసా నుంచి పాదయాత్ర మొదలు పెట్టనునట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నాలుగు పాదయాత్రలకు భిన్నంగా ఈసారి, నిత్యం రెండు వర్గాల మధ్య అలర్లు జరిగే ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభించడం ఉత్కంఠ రేపుతోంది.
ప్రజా సమస్యలు వింటూ కేసీఆర్ సర్కారు పరిపాలనా లోపాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పేరిట యాత్ర చేపడుతున్నారు. ఇప్పటికే నాలుగు విడుతల యాత్ర పూర్తయింది. ఐదో విడుత అక్టోబర్ 15వ తేదీన ప్రారంభంకానుంది. భైంసా నుంచి కరీంనగర్ వరకు ఈ యాత్ర సాగనుంది. బాసరలో సరస్వతి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసిన తర్వాత బండి సంజయ్ ఈ యాత్రను కొనసాగించనున్నారు. బాసరకు 31 కిలోమీటర్ల దూరం ఉన్న భైంసా నుంచి యాత్ర చేయనున్నారు. అటు, మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. అయితే, ఐదో విడత యాత్ర సైతం టెన్షన్ టెన్షన్‌గా సాగే అవకాశముంది. భైంసాలో రెండు వర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీ అంటేనే హిందుత్వ పార్టీ అనే గుర్తింపు పడింది. దీంతో ఆపార్టీ అంటేనే మరోవర్గం నిరంతరం నిప్పులు చెరుగుతుంది. అక్కడ వారి పరిస్థితి ఉప్పు, నిప్పుగా తయారైంది. అలాంటి పరిస్థితులు గతంలో భైంసాలో ఎన్నో చోటుచేసుకున్నాయి.
ఒకరి పై ఒకరు రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కత్తులు దూయడమే కాకుండా మర్డర్లు చేసే వరకు వెళ్లింది. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు అలాంటి ప్రాంతంలో బండి సంజయ్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకుంటుందోననే ఆందోళన నెలకొంది. అటు, ఈ ఐదో విడుత యాత్రలో బండి సంజయ్ భైంసా నుంచి తన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన కరీంనగర్ వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. ఐదో విడత పాదయాత్ర అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు సాగనున్నట్లు తెలుస్తోంది. భైంసాలోని స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు అక్కడ జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బాధితులను బండి సంజయ్ పరామర్శించే అవకాశాలున్నాయి. 1992లో మొదలైన భైంసా అల్లర్లు ఇప్పటికీ అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి.
అలాంటి సమస్యాత్మక ప్రాంతం నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేయడమంటే సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పుకుంటున్నారు. మొత్తంమీద, ఉత్కంఠ మధ్య ఐదవ విడత సంగ్రామ యాత్ర జరగనుందనే చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, బండి సంజయ్ నాలుగు విడతల్లో 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇప్పటి వరకు 1,260 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు. గత ఏడాది ఆగస్ట్ 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు.