Padma Awards: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. మెగా స్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కాలు ప్రకటించగా.. వీటిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి.
తెలంగాణ, ఏపీ నుంచి ముగ్గురిని పద్మశ్రీ వరించింది. బుర్ర వీణ వాయిద కళాకారుడైన తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు సైతం పద్మశ్రీ వరించింది. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ వరించింది. దేశంలోని తొలి మహిళా మావటి పార్వతి బారువా, అసోంకు చెందిన జగేశ్వర్ యాదవ్‌లతో సహా 34 మందికి పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది.