Site icon Prime9

Sanjay Raut: హమ్మయ్య.. ఎట్టకేలకు శివసేన ఉద్ధవ్ పార్టీ నేత సంజయ్ రౌత్ కు బెయిల్

Shiv Sena Uddhav party leader Sanjay Raut finally got bail

Mumbai: మనీ లాండరింగ్ కేసులో మూడున్నర నెలలుగా జైలులో ఉన్న ఫైర్ బ్రాండ్, శివసేన ఉద్ధవ్ ధాకరే పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన బెయిలు దరఖాస్తు పై రౌత్, ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు గత నెల 21 తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆయన బెయిల్ మంజూరైంది.

ముంబైలోని రెసిడెన్షియల్ కాలనీ రీడవలప్‌మెంట్ వ్యవహారంలో అవకతవకల ఆరోపణలకు సంబంధించి సంజయ్ రౌత్‌ను గత ఆగస్టు 1న ఈడీ కస్టడీలోకి తీసుకుంది. అరెస్టు కావడానికి ముందు ఆయన రెండుసార్లు ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు బనాయించినట్టు రౌత్ మొదట్నించీ చెబుతున్నారు. శివసేన పార్టీ తమదేనంటూ ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య పోరు జరుగుతున్న తరుణంలో రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడం నాడు ప్రాధాన్యం సంతరించుకుంది.

షిండే క్యాంపు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడాన్ని రౌత్ ఎండగడుతూ వచ్చారు. రౌత్ అరెస్టు అనంతరం ముఖ్యమంత్రి షిండే సైతం తనదైన శైలిలో స్పందిస్తూ రౌత్ అమాయకుడైతే ఈడీ విచారణకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అర్ధరాత్రి సమయంలో రౌత్‌ను అరెస్టు చేయడాన్ని ఉద్ధవ్ థాకరే ఖండించారు. తమ నేత రౌత్‌ను చూసి గర్వంగా ఉందని అన్నారు. రాజకీయ ప్రతీకార చర్యలతోనే అరెస్టులు జరుగుతున్నాయని, కుట్రలు జరిపే వారి ఆటలు కట్టిస్తామని అన్నారు. ఈడీ చర్యను కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఖండించాయి. రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని ఈడీని బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం ఉసిగొలుపుతోందని ఆ పార్టీలు ఆరోపించాయి.

ఇది కూడా చదవండి: Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. ఇకపై వారి కార్డులు రద్దు

Exit mobile version