Priyanka Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పట్ల ఆయన సోదరి ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కేంద్రంపై ఆమె ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు (Priyanka Gandhi)
మోదీ ఇంటిపేరు కేసులో వివాదాస్పద వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీని సూరత్ సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆ తర్వాత లోక్‌సభ సభ్యునిగా అనర్హుడని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఈ అనర్హత వేటుపై ఆయన సోదరి.. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ నిర్ణయంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం తమ కుటుంబం రక్తాన్ని ధారబోసిందని, అలాంటి ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. మోదీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం అమరవీరుడైన ఓ ప్రధాని కుమారుడిని దేశద్రోహి అంటూ విమర్శించారు.
ఓ భాజపా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ తండ్రి ఎవరు? అని ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని పాటిస్తూ ఓ కొడుడు తన తండ్రి మరణం తర్వాత తలపాగా ధరిస్తే దాన్నీ రాజకీయం చేశారు. నెహ్రూ పేరును ఎందుకు పెట్టుకోలేదని ఆ రోజు పార్లమెంట్‌లో ప్రశ్నించారు. అది మా కుటుంబాన్నీ, కశ్మీరీ పండిట్లను కించపర్చడం కాదా? కానీ దీనికి ఏ కోర్టు మీకు రెండేళ్ల జైలు శిక్ష వేయలేదు. అనర్హత వేటు పడలేదు. రాహుల్ లాంటి నిజమైన దేశభక్తుడు ఈ కుంభకోణాల గురించి ప్రశ్నించారు.
మీ స్నేహితుడు అదానీ.. పార్లమెంట్ కంటే గొప్పవాడా? మా కుటుంబాన్ని మీరు పరివార్‌వాదీ అంటూ చులకన చేసి మాట్లాడారు.
కానీ, ఇది తెలుసుకోండి..! మా కుటుంబం ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం తమ రక్తాన్ని ధారపోసింది. ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు ఇప్పుడు నాశనం చేయాలని చూస్తున్నారు.
మా కుటుంబం ప్రజల కోసం గళమెత్తింది. తరతరాలుగా నిజం కోసం పోరాడుతోంది. అదే రక్తం మా నరనరాల్లో ప్రవహిస్తోంది. దానికో ప్రత్యేకత ఉంది.
మీ లాంటి అధికార దాహం ఉన్నవారు.. నియంతల ముందు మేం ఎన్నడూ తలవంచలేదు.. తలవంచబోం కూడా. మీకు కావాల్సింది చేసుకోండి’’ అంటూ ప్రియాంక తీవ్రంగా మండిపడ్డారు.
మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిన్న సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద.. రాహుల్‌పై నేడు అనర్హత వేటు పడింది. అయితే, ఈ తీర్పును రాహుల్ పై కోర్టుల్లో సవాల్ చేయనున్నారు.