Site icon Prime9

Modi Kerala Visit: ప్రధాని మోదీ పై ఆత్మాహుతి దాడి చేస్తాం.. కలకలం రేపుతున్న బెదిరింపు లేఖ

Modi Kerala Visit

Modi Kerala Visit

Modi Kerala visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో కేరళ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ నెల 24,25 తేదీల్లో మోదీ కేరళ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో రాష్ట్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి గత వారం ఈ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

ఉత్తర్వులు మీడియాకు లీక్(Modi Kerala Visit)

ఈ బెదిరింపు లేఖలో దానిని పంపిన వారి పేరు, ఇతర వివరాలు కూడా ఉన్నాయి. దీంతో బెదిరింపు లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ గత వారం పోలీసులకు అప్పగించారు. దీంతో ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. అయితే, ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రొటోకాల్స్ పై ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ అవ్వడంతో విషయం బయటకు పొక్కింది. విషయం బయట రావడంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో వైపు బెదిరింపు లేఖలోని వివరాల ఆధారంగా పోలీసులు సదరు వ్యక్తిని గుర్తించారు. అతనికి విచారించగా.. లేఖకు తనకు ఎలాంటి సంబంధం లేదని .. తన పేరుతో ఎవరో లేఖ రాసి ఉంటారని చెప్పారు. తనను తప్పుడు పద్ధతుల్లో ఇరికించడం కోసమే ఈ లేఖ పంపారని సదరు వ్యక్తి పోలీసులకు స్పష్టం చేశారు. అయినా కూడా కేరళలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాయి.

 

కేరళ పర్యటనపై అనుమానాలు

ఈ బెదిరింపు లేఖ నేపథ్యంతో ప్రధాని కేరళ పర్యటనకు వస్తారా ? లేదా అనేది స్పష్టత రాలేదు. అయితే, షెడ్యూల్‌ ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వెల్లడించారు. మోదీ ఏప్రిల్‌ 24 కేరళకు వచ్చి కొచ్చిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరువనంతపురం చేరుకుంటారు. అక్కడ రాష్ట్రంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

 

Exit mobile version