Karnataka Bribe: కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే కొడుకు లంచావతారం ఎత్తాడు. ఏకంగా రూ. 40 లక్షలు తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ.. (Karnataka Bribe)
కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా భాజపా ఎమ్మెల్యే తనయుడు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత ఎమ్మెల్యే తనయుడి ఇంట్లో సోదాలు జరపగా.. భారీ ఎత్తున నగదు బయటపడింది. భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడని లోకాయుక్త అధికారులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు ప్రశాంత్ బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీప్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్‌ను తయారు చేసే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ కార్యాలయంలో ఆయన్ను అరెస్టు చేశారు. సుమారు మూడు బ్యాగుల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే విరూపక్షప్ప కేఎస్‌డీఎల్ చైర్మన్‌గా ఉండటం గమనార్హం.
ప్రశాంత్ కుమార్ సబ్బు, ఇతర డిటర్జెంట్ల తయారికీ అవసరమయ్యే ముడిసరుకులు కొనుగోలు చేసే ఒప్పందం కోసం ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆ కాంట్రాక్టర్ నుంచి సుమారు రూ. 80 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. దీంతో అధికారులు ప్రణాళికతో పట్టుకున్నారు.
ఇంట్లో భారీగా నగదు స్వాధీనం..
రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తనయుడి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా రూ. 6 కోట్ల నోట్ల కట్టలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టు చేసే సమయంలో.. దాదాపు రూ.1.7 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కర్ణాటకలో ప్రస్తుతం భాజపా అధికారంలో ఉంది. ఇప్పటికే సీఎంతో సహీ అక్కడి నేతలపై.. తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ ఘటన భాజపాను ఇరకాటంలో పడేసింది. కుమారుడు లంచం కేసులో చిక్కుకోవడంతో ఎమ్మెల్యే విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తీవ్ర విమర్శలు రావడంతో.. ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.