Site icon Prime9

నుపుర్ శర్మకు మద్దతు ఇస్తున్నాను..రాజ్ ఠాక్రే

raj-thackeray

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన నుపుర్ శర్మను అందరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తాను ఆమెకు మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నారు. నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేశారని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఆమె ఏమైతే వ్యాఖ్యలు చేశారో.. అవే వ్యాఖ్యలను గతంలో డాక్టర్ జకీర్ నాయక్ కూడా చేశారని వివరించారు. అందుకే తాను ఆమెను సపోర్ట్ చేస్తానని చెప్పారు.

జకీర్ నాయక్ ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఎవరూ క్షమాపణలు డిమాండ్ చేయలేదని రాజ్‌ ఠాక్రే గుర్తు చేశారు. అంతేకాదు, ఆయన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై విమర్శలు చేశారు. హిందూ దేవుళ్లు, దేవతలను అవమానించారని మండిపడ్డారు. అదే విధంగా తన తమ్ముడు శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేను కూడా విడిచి పెట్టలేదు. ఎంఎన్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాజ్‌ ఠాక్రే ఈ అంశాలను లేవనెత్తారు.

తాను శివసేనలో ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఉంటే వారికే సీఎం సీటు దక్కుతుందని అప్పట్లో బాలాసాహెబ్ నిర్ణయించారని వివరించారు. అలాంటి నిర్ణయాలను మీరెలా మారుస్తారని ప్రశ్నించారు. ఆ నిర్ణయాల మార్పు కూడా గోప్యంగా సాగడమేంటని నిలదీశారు. బీజేపీతో శివసేన సీఎం కుర్చీపై పేచీతో దూరమైన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని, అమిత్ షాలు పర్యటించారని అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని పలుమార్లు వారు ప్రకటనలు చేశారని వివరించారు.అప్పుడు శివసేన ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు రాజ్‌ ఠాక్రే.

Exit mobile version