Weather Update: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. అక్కడ మాత్రం ప్రత్యేకం.. పాఠశాలలకు సెలవు

Weather Update: దేశంలో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రికార్డు స్థాయిలో భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది.

Weather Update: దేశంలో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రికార్డు స్థాయిలో భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది. గత రాత్రి నుంచే తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలు వర్షం దంచి కొట్టింది. ఎడతెరపిలేకుండా హైదరాబాద్ మహానగరంలో గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి జనజీవనం స్థంభించింది. అంతే కాకుండా ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌లలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఉత్తరభారతంలో పలు రాష్ట్రాల్లో వచ్చే 2 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లోని ఫరూఖ్‌ నగర్‌, కోసాలి, మహేందర్‌గఢ్‌, సొహానా, రెవారి, నార్నౌల్‌, బావల్‌, భివారి, తిజారా, ఖైర్తాల్‌, కోట్‌పుట్లీ, ఆల్వార్‌, విరాట్‌నగర్‌, లక్ష్మాగఢ్‌, రాజ్‌గఢ్‌, నబ్దాయ్‌, భరత్‌పూర్‌, మహావా, బయానా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అక్కడ మాత్రం వేరు(Weather Update)

ఇదంతా ఒకెత్తు అయితే బీహార్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. బీహార్‌ రాజధాని పాట్నాలో భానుడి ప్రతాపం మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. అధిక ఉష్ణోగ్రతలతోపాటు వేడిగాలులతో బీహార్ రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనితో అక్కడి అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు జూన్‌ 28 వరకు సెలవులు ప్రకటించారు. 12వ తరగతి వరకు తరగతులు నిర్వహించడానికి వీల్లేదని జిల్లా మెజిస్ట్రేట్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ శనివారం ఆదేశించారు. ఇప్పటికే ఈ నెల 24వరకు సెలవులు ప్రకటించిన బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం.. ఎండ వేడిమి తగ్గకపోవడంతో ఈ సెలవులను మరో నాలుగు రోజులు పొడగిస్తూ ప్రకటన విడుదల చేసింది.