Manish Sisodia: దిల్లీ మద్యం కేసులో ఓ వైపు విచారణ వేగంగా సాగుతోంది. ఇదివరకే అరెస్టైన మనీశ్ సిసోడియా తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్ధనను.. సీబీఐ మరోసారి వ్యతిరేకించింది. దీంతో ఈ విచారణ మళ్లీ వాయిదా పడింది.
బెయిల్ కోసం దరఖాస్తు.. (Manish Sisodia)
మద్యం కుంభకోణం కేసులో విచారణ వేగంగా సాగుతోంది. ఇది వరకే ఈ కేసులో అరెస్టైన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కు ఈ కేసు నుంచి ఇప్పుడప్పుడే ఊరట లభించేలా లేదు. బెయిల్ మంజూరు కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దిల్లీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిసోదియా తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఆయన విచారణకు సహకరిస్తున్నారని, కస్టోడియల్ విచారణ అవసరం లేదని కోర్టుకు తెలిపారు.
సిసోడియా భార్య అనారోగ్యంతో ఉన్నారని.. ఆయన కుమారుడు విదేశాల్లో చదువుతున్నాడని న్యాయవాది తన వాదనలు వినిపించారు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకోవాల్సిన బాధ్యత సిసోడియాపై ఉందన్నారు. ఈ కేసులో సిసోడియా ఎలాంటి ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలు లేవని.. ఆయనో ఓ ప్రజాప్రతినిధి. ఈ కేసులో ఆయన విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. విదేశాలకు పారిపోయే ముప్పు లేదు. కావున బెయిల్ మంజూరు చేయాలని అని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
అయితే ఈ పిటిషన్ ను సీబీఐ వ్యతిరేకించింది. సిసోడియా విదేశాలకు పారిపోయే అవకాశం లేకున్నా.. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశముందని సీబీఐ తెలిపింది.
నిరంతరం ఫోన్లు మార్చిన ఓ వ్యక్తి అమాయకుడు మాత్రం కాదు. కచ్చితంగా సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నిస్తారు.
ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు 60 రోజుల గడువు ఉంది. ఇప్పుడు సిసోదియా బయటకు వస్తే దర్యాప్తు పక్కదారి పడుతుంది.
సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశముంది అని సీబీఐ వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది.
ఈడీ కేసులోనూ బెయిల్‌కు దరఖాస్తు..
ఇదే వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఈడీ.. జైల్లో ఉన్న సిసోదియాను ఇటీవల తన కస్టడీలో తీసుకుంది.
ఈ నెల 22 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ కేసులోనూ బెయిల్ కోరుతూ ఆయన దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. సిసోదియా బెయిల్ అభ్యర్థనపై మార్చి 25లోగా సమాధానం ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
మరోవైపు, ఆయన జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో సిసోదియా ఏప్రిల్ 3 వరకు జైల్లోనే ఉండనున్నారు.